Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను, సామరస్య భావనలను పెంపొందిస్తున్నాం
- ప్రభుత్వ రంగ సంస్థలను, సహకార వ్యవస్థను పరిరక్షిస్తాం
- కేరళ సమాజాన్ని చీల్చే చర్యలను తిప్పికొడుతున్నాం
- నవతెలంగాణతో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎ. విజయరాఘవన్
సామాజిక, ఆర్థిక, సంస్కృతిక రంగాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ నవ కేరళను నిర్మించడమే ఎల్డీఎఫ్ ప్రభుత్వ లక్ష్యమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎ. విజయరాఘవన్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, అణగారిన ప్రజల అభివృధ్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, అదే సమయంలో సామాజిక బాధ్యతలనూ నెరవేర్చాలని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను, సహకార వ్యవస్థను పరిరక్షించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నామని చెప్పారు. 'దానికోసం శాస్త్రీయ ఆలోచనలను, సామరస్య భావనలను ప్రజానీకంలో పెంపొందించాలి. మతమౌఢ్యాన్ని గట్టిగా ప్రతిఘటించాలి. సాంప్రదాయ ఆర్థిక సంస్కరణలను తిరస్కరించి నిజమైన స్వావలంబన విధానాలను అమలు చేయాల్సి ఉంది. ఈ దిశలో కృషి పెద్ద ఎత్తున పెద్దఎత్తున ప్రారంభమైంది' అని ఆయన అన్నారు. ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా..
ప్ర: కేరళలో సీపీఐ(ఎం) కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఎందువల్ల?
జ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఈ హింసాకాండ ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు జరిగిన హింసలో ఆరుగురు సీపీఐ(ఎం) కార్యకర్తలు అమరులయ్యారు. ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతున్నది. దాడులను ప్రజానీకం ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తున్నది. ఒక పథకం ప్రకారం బీజేపీ చేస్తున్న ఈ దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తున్నది. ఆ రెండు పార్టీల మధ్య నెలకొన్న ఈ అపవిత్ర పొత్తును ప్రజలు గుర్తించారు. ఇటీవల .జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలనూ ప్రజానీకం తిరస్కరించింది. బీజేపీ గతంలో ఉన్న ఒక్క సీటును కూడా కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఛాందస వాదులు కూడా హింసకు పాల్పడుతున్నారు. ఈ తరహా దాడుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. తిప్పికొడుతున్నారు.
ప్ర: మతోన్మాద కుట్రలు ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి?
జ : కేరళ సమాజాన్ని చీల్చే కుట్రలకు ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో పాల్పడుతున్నది. సున్నిత అంశాలతో రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నది. తాజాగా చర్చనీయాంశంగా మారిన హలాల్ వివాదం కూడా ఇటువంటిదే. కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఛాందసవాదం కూడా ఈ తరహా ప్రయత్నాలు చేస్తోంది. చైతన్యవంతులైన కేరళీయులు వారి కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు.
ప్ర: కేరళ ప్రస్తుతం ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి?
జ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే మాకు అతి పెద్ద సమస్య. సాంప్రదాయంగా ఉన్న ఆదాయవనరులను కొల్లగొట్టడంతో పాటు, రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నది. పన్నుల్లో మాకు రావాల్సిన వాటా కొన్నేండ్లుగా తగ్గిపోతున్నది. రుణాలు సేకరించడానికి మార్గాలు కుదించేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్లు, ఇతర నిధులు కూడా తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం రాష్ట్ర సొంత ఆదాయ వనరుల మీదా ప్రభావం చూపుతున్నది. వీటన్నింటిని అధిగమించి స్వావలంబన దిశలో కేరళను నడపడం ఎల్డీఎఫ్ ముందు ఉన్న అతి పెద్ద సవాల్. ప్రజల సహకారంతో దీనిని సాధిస్తాం.
ప్ర: ప్రభుత్వరంగ సంస్థల విషయంలో మీ వైఖరి ఏమిటి?
జ: వీటిని కార్పొరేట్లకు అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని మేం చెబుతున్నాం. దీనికోసం కేంద్రం మూసివేస్తున్న, వేలానికి పెడుతున్న సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నది. తిరువనంతపురం విమానాశ్రాయాన్ని ఆదాని, అంబాని వంటి వారితో పోటీపడి రాష్ట్రం దక్కించుకున్నది. మరికొన్ని సంస్థలను ఇలానే స్వాధీనం చేసుకుంది. దీనివల్ల సాధారణ ప్రజల జీవితాలకు భద్రత ఏర్పడటంతో పాటు, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతున్నది. సహకార బ్యాంకుల విషయంలోనూ కేంద్రం ఇటువంటి విన్యాసమే చేస్తున్నది. వాటిని కాపాడుకోవడానికి మా శక్తి మేర కృషిచేస్తాం.
ప్ర: సంస్థల నిర్వహణకు నిధులు ఎలా సమీకరిస్తున్నారు.?
జ: దీనికోసం కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా మౌలిక వనరుల నిర్మాణ, నిర్వహణ కోసం రుణాలు సేకరిస్తున్నాం, ఇలా సేకరించే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. ఇలా సేకరించిన రుణాలను పెట్టుబడి వ్యయం( కేపిటల్ ఇన్వెస్టిమెంట్)గా ఖర్చు చేయాలన్నది మా నియమం. ఇటువంటి నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ. రాష్ట్ర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పటికే ఉన్న మౌళికవనరులను అప్‌గ్రేడ్ చేయడానికి, సామాజిక బాధ్యతలు నెరవేర్చడానికి వినియోగిస్తున్నాం. రాష్ట్ర ప్రజల్లో 30 శాతం మందికి సామాజిక ప్రయోజనాలు అందుతున్నాయి.
ప్ర: ఈ ఏడాది పెద్ద సంఖ్యలో మహిళలు సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు గదా? ఈ కృషిని ఎలా ముందుకు తీసుకుపోతున్నారు?
జ: దాదాపు రెండు వేల శాఖలకు మహిళలు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావడం ఇదే ప్రధమం. ప్రతి జిల్లా కార్యదర్శివర్గంలోనూ కనీసం ఒక మహిళకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నాం. రాబోయే రెండు, మూడేండ్లలో మొత్తం పార్టీ సభ్యుల్లో 25 శాతం మహిళలు ఉండాలన్నది మా లక్ష్యం. ప్రభుత్వంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
ప్ర: పూజారులుగా దళితులను నియమించారు కదా... స్పందన ఎలా ఉంది?
జ: మంచి స్పందన ఉంది. అన్ని వర్గాల వారు అభినందించారు. ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ సమస్యలు సృష్టించాలని చూసినప్పటికీ ఫలితం కనిపించలేదు. సామాజిక రంగంలో ఈ కృషిని మరింత ముందుకు తీసుకుపోతాం.