Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికమైత్రిని విస్తరిస్తాం : హన్నన్మొల్లా
రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా రైతాంగ ఉద్యమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్మొల్లా అన్నారు. ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సోమవారం నుండి హైదరాబాద్లో జరగనున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలను ప్రస్తావించారు. కార్పొరేట్లకు అనుకూలంగా నరేంద్రమోడీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కార్మిక, కర్షక మైత్రి పెద్ద ఎత్తున వ్యక్తమైందని, దేశ చరిత్రలోనే ఇది అపూర్వఘట్టమని అన్నారు. ' ఈ మైత్రిని మరింత విస్తరిస్తాం. క్షేత్రస్థాయికి తీసుకుపోతాం. సంఘటిత ఉద్యమాలను నిర్మిస్తాం' అని చెప్పారు. ఈ అంశాలతో పాటు రైతాంగాన్ని ఎన్నో సమస్యలు ఎక్కడికక్కడ స్థానికంగా ప్రభావితం చేస్తున్నాయని, హైదరాబాద్లో జరిగే జాతీయ కౌన్సిల్లో దీనిపై కూడా చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా...
ప్ర : ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగ ఉద్యమం సమైక్యంగా సుదీర్ఘకాలం ఎలా కొనసాగింది?
జ : ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఒక పథకం ప్రకారం దశల వారీగా రైతాంగంపై దాడి ప్రారంభించారు. రైతాంగం కూడా అదేవిధంగా స్పందించింది. అఖిలభారత కిసాన్ సభ ప్రారంభించిన ఆందోళన క్రమేణా విస్తృత రూపం దాల్చింది. కొన్నేళ్లపాటు ఈ పోరాట సేద్యం జరిగింది. ఫలితం ఐదువందలకుపైగా సంఘాలతో అఖిలభారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్సిసి) ఏర్పాటు, సంయుక్త కిసాన్ మోర్చా ఆవిర్భావం.
ప్ర: రైతాంగంపై మోడీ సర్కారు ఎలా దాడి చేసింది? ప్రతిఘటన ఎలా జరిగింది?
జ: మోడీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు ప్రయత్నించింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయినా, మోడీ సర్కారు వైఖరిలో నామమాత్రపు మార్పు రాకపోగా, కార్పొరేట్ అనుకూల చర్యలను మరింత వేగం చేశారు. 2014లో భూ సేకరణ చట్టంలో మార్పులను చేస్తూ రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఎఐకెఎస్ తీవ్రంగా ప్రతిఘటించింది. భూమి అధికార్ ఆందోళన్ను ప్రారంభించింది. కిసాన్ సభ పిలుపుతో దేశ వ్యాప్తంగా 4వేల ప్రాంతాల్లో ఈ చట్టం ప్రతులను దగ్ధం చేశారు. ఎన్నికల ముందు నరేంద్రమోడీ 300కు పైగా సభల్లో తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు. కానీ, దానికి భిన్నంగా 2017లో కార్పొరేట్లకు అనుకూలంగా ఎంఎస్పి చట్టం తీసుకువచ్చారు. దీంతో రైతుల పరిస్థితి మరింత ఘోరంగా మారింది. అదే ఏడాది జూన్ 20 వ తేదిన ఎఐకెఎస్ చొరవతో ఎఐకెఎస్సిసి ఆవిర్భవించింది. దీనిలో 100 నుండి 120 సంఘాలు ఉన్నాయి. 2017 నుండి 19 వరకు దేశవ్యాప్తంగా ఎంఎస్పి కోసం ప్రచార, ఆందోళనలు జరిగాయి. 2020 జూన్20 వ తేదిన వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పచెబుతూ మూడు నల్ల చట్టాలను మోడీ సర్కారు తీసుకువచ్చింది. ఈ నిర్ణయం కూడా రాత్రిపూటే వెలువడింది. దీంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకింది, సెప్టెంబర్ 25న జరిగిన సమావేశంలో ఎఐకెఎస్సిసిలో మరిన్ని సంఘాలు చేరడంతో భాగస్వాముల సంఖ్య 250కి చేరింది. అక్టోబర్ 27 నాటికి భాగస్వామ్య సంఘాల సంఖ్య 500కు పెరగింది. చర్చల అనంతరం నల్లచట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్లు ముందుకు వచ్చాయి. పంజాబ్, హర్యానా ప్రాంతాలకు చెందిన దాదాపు 500 సంఘాలు సంయుక్త కిసాన్మోర్ఛాగా ఏర్పాటయ్యాయి. ఈ రెండు ఆందోళనలను పరస్పరం సహకరించుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయాయి. నవంబర్ 26, 2020న రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరు చూశారు. ఉద్యమాన్ని విచ్ఛినం చేయడానికి జరిగిన కుట్రలను తిప్పికొట్టి రైతులు విజయం సాధించారు.
ప్ర: కిసాన్, మజ్ధూర్ ఏకత (కార్మిక, కర్షక ఐక్యత)ను ఎలా సాధించారు? భవిష్యత్తులో ఎలా కొనసాగించనున్నారు?
జ. మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రైతులు ఎలా నష్టపోయారో కార్మికులు అలాగే నష్టపోయారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల కోసం నల్లచట్టాలు తీసుకువస్తే, పారిశ్రామిక రంగంలో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను రూపొందించారు. దీనికి మూలం ఆర్థిక విధానాలని గుర్తించాం.కార్మికులు, రైతులు ఉత్పత్తి చేసేవారు. ఈ విషయాన్ని వారికి అర్ధమయ్యేటట్లు చెప్పాం. ఫలితంగా రైతు, కార్మిక సంఘాలు తమ ఆందోళనలను, పిలుపులను సమన్వయం చేసుకోవడం సాధ్యమైంది. ఈ ఐక్యత చారిత్రాత్మక అవసరం. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగితే ఎన్నో మార్పులు సాధించవచ్చు. రైతాంగ ఉద్యమానికి కార్మికులు ఎన్నో విధాలుగా సహకరించారు. కార్మికులు చేపట్టే కార్యక్రమాలకు రైతాంగ మద్దతు కొనసాగుతోంది.
ప్ర: రైతాంగ ఉద్యమం, సమస్యల పట్ల వారి స్పందన దేశమంతా ఒకే విధంగా లేదు కదా?
జ: ఇదో వైరుధ్యం! దేశమంతా వ్యవసాయ సీజన్ ఒకే సారి ప్రారంభం కాదు. ఒక ప్రాంతంలో కోతలు జరుగుతుంటే మరో ప్రాంతంలో నాట్లు వేస్తుంటారు. ఆహారపంటల సమస్యలు ఒక మాదిరి ఉంటే, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులవి మరో రకమైన సమస్యలు. అందుకే మూసలో పోసిన విధంగా దేశమంతా ఒకే సమయంలో ఒకే నినాదం ఇవ్వడం సాధ్యం కాదు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ముందుకొచ్చే అంశాలే కీలకంగా మారుతాయి. హైదరాబాద్లో జరిగే జాతీయ కౌన్సిల్లో ఈ అంశాన్ని సమగ్రంగా చర్చిస్తాం. రైతాంగ స్థానిక సమస్యల పరిష్కారానికి ఒక కార్యాచరణను రూపొందిస్తాం.
ప్ర: హైదరాబాద్ సమావేశంలో ఇంకేం చర్చింనున్నారు?
జ: రైతు ఉద్యమం ఇప్పటిదాకా పురోగతి సాధించిన తీరు సమీక్షించి, భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తాం. రైతు సంఘాన్ని మరింత ధృడంగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం, మరింతగా ఎక్కువ మందిని సంఘ పరిధిలోకి తీసుకురావడంపై కూడా చర్చజరుగుతుంది. అదే విధంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి నెలలో ఇచ్చిన బంద్పిలుపును జయప్రదం చేయడంపై కూడా చర్చిస్తాం.