Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూతను ఆశిస్తున్న తామరపురుగు
- మిర్చితో పాటు అన్ని పంటలపై ప్రభావం
- తామర పురుగుకు తోడు, నల్లనల్లి వ్యాప్తి
- లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతుల్లో ఆందోళన
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మిరప రైతుల్ని ఎకరానికి రూ.లక్షకు పైగా నష్టపెట్టిన తామర పురుగు.. క్రమంగా కూరగాయ పంటలు, పండ్ల తోటలకూ విస్తరిస్తోంది. ఇప్పుడు మామిడి పూతలోనూ కనిపిస్తోంది. ఈ పురుగు ఉధృతికి రూ.లక్షల పెట్టుబడి బుగ్గిపాలు కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికీ దీనికి సరైన మందు సూచించడంలో విఫలమయ్యారని రైతులు వాపోతున్నారు. కనీసం మామిడి, ఇతర ఉద్యాన పంటల విషయంలోనైనా ఆ పరిస్థితి లేకుండా చూడాలని కోరుతున్నారు. తొలుత తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా తోటల్లో దీని ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మామిడినీ ఈ పురుగు ఆశించిందని ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా ప్రభావం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ పురుగు తాకిడి అధికమైతే.. నోరూరించే తియ్యటి మామిడి ఈ ఏడాది లభించడం కష్టమే. మిరప తరహాలోనే మామిడి రైతులూ పెద్ద ఎత్తున పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ తదితర జిల్లాల్లో మామిడి అధిక మొత్తంలో సాగవుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 30వేల హెక్టార్ల వరకు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన.. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దున.. సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో మామాడి తోటలు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక మామిడి దిగుబడి ఖమ్మం జిల్లాలోనే ఉంటుంది. ఏటా ఒకటిన్నర లక్షల టన్నుల దిగుబడి ఉమ్మడి జిల్లా నుంచి వస్తుంది. కానీ తామర పురుగు ప్రభావంతో గణనీయంగా దిగుబడి తగ్గుతుందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మిర్చిలో ఈ పురుగు నియంత్రణకు డిసెంబర్లో మూడుసార్లు, జనవరిలో ఇప్పటికే ఒకసారి ఉమ్మడి జిల్లాలో తోటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు నేటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రైతులు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తామరపురుగుతో తీరని నష్టం
తామర పురుగు మామిడి తోటలకూ తీరని నష్టం చేస్తోంది. పూత నిలవదు. పిందెలు కావు.. మొత్తంగా దిగుబడి భారీగా తగ్గుతుంది. ఎకరానికి రూ.50వేలకు పైగా పెట్టుబడులను నష్టపోవాల్సి ఉంటుంది. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలలో మామిడి పూత మొదలవుతుంది. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పూత సకాలంలో రాలేదు. కాస్త ఆలస్యంగా జనవరిలో మొదలైంది. నెలాఖరు నాటికి చెట్లు పూతతో కళకళలాడుతాయి. ఈ దశలో తామర పురుగు ఆశిస్తే చెట్టుకు రెండు, మూడు కాయలు నిలవడం కూడా కష్టమేనని మామిడి రైతులు వాపోతున్నారు.
జిగురు అట్టలే పరిష్కారమంటున్న సైంటిస్టులు
మిరప, ఇతర పంటల్లో తామర పురుగు ఉధృతి నివారణకు రైతులు పెద్ద ఎత్తున పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. కానీ పురుగు నియంత్రణ కాకపోగా.. తీవ్రత మరింత ఎక్కువవుతోంది. దీని నివారణకు పసుపు, నీలి రంగుతో కూడిన జిగురు అట్టలు పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
నల్ల తామరనల్లితో పూత నల్లబడి రాలుతుంది..
ముంగి వెంకన్న, కౌలు రైతు, బోనకల్
20 ఎకరాల మామాడి తోటను రూ.8 లక్షలకు కౌలుకు తీసుకున్నాం. ఇప్పటికే రూ.లక్ష మందులు పిచికారీ చేశాం. అడుగు మందులూ వేశాం. కానీ పరిస్థితి చూస్తుంటే ఆందోళనకరంగా ఉంది. ఈ సారి పురుగు కారణంగా అప్పులపాలవుతామేమోనని భయంగా ఉంది.