Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలి
- ప్రభుత్వ నిబంధనలు పాటించాలి: సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలనీ, ప్రభుత్వ నిబంధనలు పాటించాలనీ, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి -వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు రోడ్లు భవనాలు ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనా విషయంలో అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 ఏండ్ల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదనీ, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలని సూచించారు.
నేటి నుంచి బూస్టర్ డోస్...
సోమవారం నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు.
ఇండ్లలోనే సంక్రాంతి
రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్దంగా వుందని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
సెక్రెటేరియట్ పనులన్నీ వేగంగా సాగాలి
నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాం తరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ...
సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించి ఐదు నెలలు గడిచినా కేంద్ర జల సంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌ల అనుమతుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం కోరుతున్న అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డా. బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ ను త్వరితగతిన సిద్దం చేసి కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరిపి ఐదు గోదావరి ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్ర జల సంఘానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి శాఖలో ప్రస్థుత సంవత్సరంలో ముఖ్యమైన ప్రాజెక్టుల టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన లిఫ్టు పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారా బాద్ జిల్లాల పనులు, డా. బి ఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బ్యారేజి, చెన్నూర్ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.