Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో ఎస్పీని బలపరుస్తాం
- ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ కూటమి
- ఈసీ పారదర్శకంగా ఎన్నికలు జరపాలి
- మోడీ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి
- బీజేపీని ఓడించడమే మా లక్ష్యం
- రాజకీయ ముసాయిదా తీర్మానానికి ఆమోదం
- ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కేరళలో జాతీయ మహాసభలు: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీని వ్యతిరేకించే పార్టీలకే తమ మద్దుతు ఉంటుందనీ, వాటితో కలిసి పనిచేస్తామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను బట్టి వివిధ పార్టీలతో ఎన్నికల అవగాహన ఉంటుంద న్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని చెప్పారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, ఉత్తరా ఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని ప్రకటిం చారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి, ప్రజల బతుకులు మెరుగు పడేందుకు బీజేపీ ఓటమి ఎంతో అవసరమని అన్నారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కరోనా నియంత్రణ, అందరికీ టీకా సకాలంలో ఇవ్వడంలో మోడీ విఫలమయ్యారని విమర్శిం చారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజలను లూటీ చేయడమేనని విమర్శించారు. ధరల పెరుగుదలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందని అన్నారు. మోడీ విధానాలతో నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజానీకం ఓటేస్తుందని చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) వినియోగించు కోవాలని సూచించారు. ప్రధాని సహా ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అరికట్టాలని చెప్పారు. ఎన్నికల బాండ్లు 80 శాతం బీజేపీకి వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ డబ్బును విచ్చిలవిడిగా ఎన్నికల్లో వాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. రాజకీయ అవినీతిని బీజేపీ చట్టబద్ధం చేసిందని విమర్శించారు. పారదర్శకంగా ఈసీ ఎన్నికలు జరపాలని కోరారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని చెప్పారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగకుండా బీజేపీ కుట్ర చేస్తోందనీ, దానికి వ్యతిరేకంగా ఈసీ పనిచేయాలని సూచించారు.
ఫిబ్రవరిలో రాజకీయ తీర్మానం విడుదల చేస్తాం
సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభలు ఏప్రిల్ ఆరు నుంచి పదో తేదీ వరకు కేరళలోని కన్నూరులో జరుగుతాయని సీతారాం ఏచూరి చెప్పారు. కరోనా తీవ్రత అప్పుడుండే పరిస్థితులను బట్టి జరపాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆ మహాసభకు సమర్పించే రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని కేంద్ర కమిటీ ఆమోదించిందని వివరించారు. కేంద్ర కమిటీ సభ్యులు ప్రతిపాదించిన సవరణలను పొలిట్‌బ్యూరో చర్చించి ఫిబ్రవరి మొదటివారంలో బహిరంగంగా విడుదల చేస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు దానిపై చర్చించి అభిప్రాయాలు, సవరణలుంటే కేంద్ర కమిటీకి పంపించాలని అన్నారు. మహాసభలో వాటికి సమాధానం వస్తుందన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన సీపీఐ(ఎం) తెలంగాణ కమిటీకి అభినందనలు చెప్పారు.
ఎన్నికల ముందే ఫ్రంట్ ఏర్పడదు
ఎన్నికల ముందే ఎలాంటి ఫ్రంట్ ఏర్పడబోదని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు అయన సమాధానమిచ్చారు. ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడుతుందని ఏచూరి అన్నారు. యునైటెడ్ ఫ్రంట్, యూపీఏ, ఎన్డీఏ ఎన్నికల తర్వాతే ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఎన్నికల అవగాహనపై ఆయా రాష్ట్రాల్లో నిర్దిష్ట రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలుంటాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ పనిచేసినా తాము ఆహ్వానిస్తామని అన్నారు. రాష్ట్రంలోనూ ఎన్నికల సమయానికి తగిన రాజకీయ వ్యూహం అనుసరిస్తామని వివరించారు. యూపీలో బీజేపీ, ఎస్పీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. అందుకే ఎస్పీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పంజాబ్‌లో సీపీఐ, సీపీఐ(ఎం)తోపాటు ఇతర వామపక్ష పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని వివరించారు. పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీని అటకాయించారని ఎవరు చెప్పారని ఓ విలేకరిని తిరిగి ప్రశ్నించారు. ప్రధాని హెలికాప్టర్లో వెళ్లాలనీ, ఏ కారణాల వల్ల రోడ్డు మార్గంలో వెళ్లారో విచారణ జరుగుతున్నదని అన్నారు. మోడీ వెళ్లే సభకు ప్రజలకు తక్కువగా వచ్చారని వివరించారు. గతంలో భద్రతా వైఫల్యాల రీత్యా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ఇద్దరు ప్రధానులను పోగొట్టుకున్నామని చెప్పారు. భద్రతా వైఫ్యలముంటే తీవ్రంగా పరిగణించాలనీ, ఏదైనా విచారణలో తెలుస్తుందని అన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం) విలీనంపై తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని ఏచూరి సమాధానమిచ్చారు. అస్సాం, తమిళనాడులో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పారు. బీజేపీని ఓడించే పార్టీలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బీజేపీ పట్ల కేసీఆర్ వైఖరి ఎలా ఉందో ఆయనే చెప్పాలన్నారు. వివాహ వయస్సును 18 నుంచి 21 ఏండ్లకు పెంచడం సరైంది కాదన్నారు. 18 ఏండ్లకే ఓటు హక్కు కల్పించారనీ, కానీ భర్తను పొందే హక్కు లేదని చెప్పారు. శిశుమరణాలను తగ్గించాలనీ, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలనీ, మహిళల ఆరోగ్యంపై ఖర్చును పెంచాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పట్ల టీఆర్ఎస్ మెతక వైఖరి
బీజేపీని ఓడించాలని టీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు పిలుపు రాలేదు రాష్ట్రంలో బీజేపీ ప్రమాదకరంగా ఎదుగుతున్నది. ఆ పార్టీని నిలువరించడమే ఏకైక లక్ష్యం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నది. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేదాకా నికరంగా పోరాడతాం. బీజేపీ పట్ల టీఆర్ఎస్ మెతక వైఖరి అవలంబిస్తున్నది. బీజేపీ విధానాలను ఓడించాలని టీఆర్ఎస్ చెప్పాలి. బీజేపీపై కేసీఆర్ పోరాటంలో లోపముందనీ, కొన్ని విషయాల్లోనే వ్యతిరేకిస్తున్నాం. - సీపీఐ(ఎం)
రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
యూపీలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని సీతారాం ఏచూరి అన్నారు. దీంతో బీజేపీ నాయకులు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే యూపీలో ధర్మ్ సంసద్ ఏర్పాటు చేసి ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో పౌరయుద్ధం వచ్చేలా బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలనీ, వారి మీద కేసులు నమోదు చేయాలనీ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూపీలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఓటర్లమీద ఒత్తిడి తెస్తున్నదని చెప్పారు. అభ్యర్థులు స్వతంత్రంగా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలనీ, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉండాలని ఈసీని కోరారు.