Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గడ్డపై చెరగని నెత్తుటి ముద్రలు
దౌర్జన్యం
దైన్యం...
మొండి ధైర్యం
మహా తిరుగుబాటు!!
తెలంగాణ పేరు వింటే మదిలో ఎన్నోజ్ఞాపకాలు.
అంతేనా...
దొరల కాళ్లకింద...
పటేల్, పట్వారీల పైశాచికం కింద...
నిజాం, రజాకార్ల నియంతృత్వం కింద...
నెహ్రూ సైన్యాల అణచివేతల కింద...
పడిన అద్దమై పగిలిన పల్లెల బతుకు చిత్రం గుర్తొస్తది...
మట్టి మనుషులే యుద్ధమై వెట్టి చాకిరీకి గోరీకట్టిన వీరత్వమూ గుర్తుకొస్తది.
ఎర్రజెండా అద్దుకున్న త్యాగం మదికొస్తది.
ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ నేలను వీర తెలంగాణగా శాశ్వతం చేసిన ఘన చరిత్ర ఈ ప్రజలది కుల, మత, ప్రాంత విభేదాలకు అతీతంగా... ముందుకు సాగిన ఐక్యమత్యం, సంఘతత్వానిదే ఆ ఘనత.
సరిగ్గా ఏడున్నర దశాబ్దాల ఎనకటికిపోతే... తెలంగాణ ప్రజల సత్తువేందో, పరిస్థితి ఏంటో తెలుస్తది.
సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్య కాంక్ష మిగిల్చిన రెండో ప్రపంచ యుద్ధ బీభత్సం, బ్రిటిష్ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఎగిసిన జాతీయోద్యమోత్సాహం తారాస్థాయికి చేరిన తరుణమది. ఆ సమయంలో మన తెలంగాణలో వెట్టిచాకిరీ, దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా రాజుకున్న నిప్పురవ్వ... ఐదేండ్లకు పైగా అగ్నిగుండమై రగిలి, దొరల గడీలను గడగడలాడించింది. నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రాన్ని తలచి, అచ్చమైన ప్రజా తిరుగుబాటుగా నిలిచింది. చరిత్ర సాళ్లలో 'వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా విరబూసి ప్రసిద్ధికెక్కింది.
మట్టి బిడ్డలు చేసిన ఆ మహా పోరాటానికి నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, అన్నిటికి మించి పాలకుల దుర్మార్గమైన విధానాలే కారణం. దొరలు హుకుం జారీ చేస్తేచాలు ఉత్తపుణ్యానికే ఊరంతా వారికి ఊడిగం చేయాలే. నేడు కలలోనైనా ఊహించని కల్తీ పనులు, అడ్డమైన గోడ్డు చాకిరి కింద పేదలంతా నలిగారు, నరకయాతన పడ్డారు. సర్వస్వం కోల్పోయారు. పటేళ్లు కనుసైగ చేస్తేచాలు... మోట గొట్టాలే - నీళ్లు గట్టాలే, దుక్కులు దున్నాలే.. మొక్కలు నాటాలే, పంట కోయాలే గరిసెలు నింపాలే... ఈ పనుల్లో దేనికీ కూలీ అనేది ఉండదు. దొరలు దయదలచి పొలంలో విడిచే పరిగె, కల్లంలో వదిలే తాలుదవ్వతోనే కడుపునింపుకోవాలె. అంతేనా...? ఆకిలి ఊకాలే, బట్టలు ఉతకాలే.. విందులకు మేకలు ఇయ్యాలే... ఎందాకైనా మేనలు మొయ్యాలే. వృత్తుల వారిగా వారికి సేవలు చెయ్యాలె.
ఇక ఆడవారిపై జరిగిన ఆగడాలు చెప్పనలవి కానివి. ''ఇదేందంటే కూటికి లేకుండా చెయ్యడం... ఎదిరిస్తే కాటికి పంపడం'' ఇదే నాడు పేదోడికి దక్కిన న్యాయం.
సరిగ్గా... ఈ ఆరాచకమే, దొరల దోపిడీ రాచరికమే... పల్లెపల్లెన తిరుగుబాటుకు కారణమై వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిల్చింది. అక్షర జ్ఞానం, మాతృభాషపై మమకారం, హక్కుల కాంక్ష, సంఘ చైతన్యమే... అందుకు బలమైన పునాదిగా నిలిచింది. ఈ క్రమంలో మొదలైన గ్రంథాలయ ఉద్యమం... సాంస్కృతిక సమరంగా... వెట్టిచాకిరీ విముక్తి, ఆపై ప్రజాస్వామ్య హక్కులకై సాగిన ధిక్కార మహౌద్యమంగా మారింది. ఈ ధిక్కారానికి సైద్ధాంతిక పునాది నేర్పరచి ప్రజలను సంఘటితం చేసింది కమ్యూనిస్టు చైతన్యం. నిబద్దనాయకత్వం, త్యాగం, పల్లె ప్రజల తెగువ, సమయస్ఫూర్తి. ఈ పోరాటాన్ని పదునుదేర్చి ప్రత్యేకంగా నిలిపాయి.
ఈ యుద్ధంలో ప్రజలే గెలిచారని కచ్చితంగా చెప్పొచ్చు. తెలంగాణ పోరాటం జరిగిన తీరే అందుకు నిదర్శనం. పదునైన ఆయుధాలు, తుపాకులు, మర ఫిరంగులు వాడుతూ... మందీ మార్భలంతో... దొరలు, రజాకార్లు, నిజాం సైన్యం, ఆ తరువాత నెహ్రూ సైన్యం చేసిన దాడుల్ని... పేదలు ఎదుర్కొన్న తీరు అద్భుతం, అత్యంత సాహసోపేతం. రాళ్ళు - రప్పలు, కర్రలు - కారం, వడిసెలలు - పొగబాంబులు, గుత్పలు - పిడిగుద్దులు కొద్దిపాటి నాటుతుపాకులే ప్రజలు వాడిన ఆయుధాలు. నిజానికి ఈ ఆయుధాలకంటే... మట్టి మనుషుల గట్టి పట్టుదల - ఊరూరా వెలిసి నిలిచిన సంఘాలే... మన తెలంగాణ కొత్త చరిత్రకు పురుడు పోశాయి. ఈ పోరాటం దున్నేవాడిదే భూమి నినాదాన్ని తెచ్చి, దేశంలో భూసంస్కరణలకు నాందిపలికింది. వెట్టిచాకిరీ రద్దు చేసింది. సామాన్యులు సైతం తలెత్తుకు బ్రతికే ధైర్యం అందించింది.
కాలం కదలవట్టె.... దొర గడీలకు చెదలు పట్టె! మరిప్పుడు... ఒకవైపు బుసకొడుతున్న సామ్రాజ్య వాదం, పెట్టుబడిదారీ భూస్వామ్య దోపిడీ, మరోవైపు స్వార్థరాజకీయ క్రీడలో విషం చిమ్ముతున్న కుల, మతతత్వం... ప్రజాస్వామ్య, మత సామరస్య భారతానికి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనాటి వీరతెలంగాణా పోరాట వారసురాలు ప్రజా పోరాటాల సారథి సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర 3వ మహాసభలు రంగారెడ్డిజిల్లా పోరుగడ్డ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజాల్‌లో జరుగనున్నాయి. ఈ సందర్భంలో వీరతెలంగాణ ఉద్యమ కీర్తిని మళ్ళీ నెమరేసుకోవాలి. మట్టి మనుషులే మహానాయకులై నడిపిన ఆ పోరాటంలో... ప్రతిగట్టుకు, ప్రతి గుట్టకే కాదు... చెట్టు చెట్టుకూ, పుట్టపుట్టకూ... ప్రతి పల్లెకూ ఓ ప్రత్యేకమైన కథ ఉంది. ఆ కథల్లో హీరోలైన సామాన్యుల త్యాగాలు వారికి వెన్నుదన్నుగా నిలిచిన ఎర్రజెండా పోరు గాధలున్నాయి.
అందుకే... అన్నిటినీ కాకపోయినా... ప్రధానమైన కొన్ని ఉద్యమ క్షేత్రాల కథల్ని ''త్యాగాల వాకిళ్లు - పోరు పల్లెల వీరగాధలు'' పేర నాటి వీరుల సాహసాల్ని, ఆ నేలల్ని మరోసారి మన ఎదలోకి ఒంపుకునే ప్రయత్నం చేద్దాం!. ఈ సందర్భంగా ఆయా స్థలాలను సందర్శించిన అనంగారి భాస్కర్ మనకు ప్రతి రోజూ కడవెండి నుండి ముదిగొండ వరకు ఈ త్యాగాల వాకిళ్ళను పరవనున్నారు.
- సంపాదకవర్గం