Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికి మోడీ విధానాలే విలన్
- 'నవతెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏఐకేఎస్ పంజాబ్ ప్రధాన కార్యదర్శి మేజర్ సింగ్ పన్నావాల్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''రైతు ఉద్యమంలో రైతులే హీరోలు, వారికి ప్రధాని నరేంద్రమోడీ విధానాలే విలన్. ఏడాదిపాటు సాగిన పోరాటంలో రైతాంగ శక్తిని కేంద్రప్రభుత్వం తక్కువ అంచనా వేసింది. అన్నదాత శక్తి ముందు మోడీ అధికారం తలవంచక తప్పలేదు. 'దేశంకోసం-ధర్మం కోసం' అంటూ అధికారపార్టీ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా రైతాంగం ఐక్యంగా నిలిచింది. చివరకు స్వయంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణలు చెప్తూ, మూడు నల్ల చట్టాలనూ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించక తప్పని పరిస్థితిని రైతులు కల్పించారు. ఈ స్ఫూర్తి మరిన్ని ఉద్యమాలను సృష్టిస్తుంది. కేంద్రప్రభుత్వ కార్పొరేటీకరణ విధానాలపై పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే'' ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేజర్ సింగ్ పన్నావాల్ చెప్పిన మాటలు ఇవి. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన 'నవతెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తి ఎలా ఉంది?
అనన్యం. చారిత్రాత్మకం. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమాలకు ప్రేరణ.
ఆ ఉద్యమంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి?
ఉద్యమ ప్రారంభ సమయంలో మేమే ఢిల్లీ సరిహద్దులకు మొదటగా వెళ్లాం. మీడియా-మోడీ ఏకత్వం ప్రదర్శించారు. మా డిమాండ్లను పట్టించుకోలేదు. పైగా అవహేళన చేస్తూ, అవమానిస్తూ వార్తల్ని ప్రసారం చేశారు. దేశవ్యాప్తంగా మాకు మద్దతు పెరిగే కొద్దీ మీడియాకు మా డిమాండ్లను వెల్లడించక తప్పలేదు. మూడు నల్లచట్టాలను మూడేండ్లు సస్పెండ్ చేస్తాం అన్నా మేం వినలేదు. రద్దు డిమాండ్‌కే కట్టుబడి ఉన్నాం. మేం పడని కష్టాలు, అవమానాలు లేవు. ఎదురులేని నాయకుడిగా చెలామణి అవుతున్న ప్రధాని నరేంద్రమోడీతో జాతికి క్షమాపణలు చెప్పించగలిగాం. చట్టాల రద్దును సాధించాం.
కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) డిమాండ్ సంగతి ఏంటి?
కచ్చితంగా దాన్నీ సాధిస్తాం. క్షేత్రస్థాయిలో దేశవ్యాప్తంగా సమీకరణలు చేస్తున్నాం. ఎమ్మెస్పీ చట్టం కేవలం పంజాబ్ రాష్ట్రానికే ఉంటే చాలదు. దేశవ్యాప్త రైతాంగానికి అవసరం.
బ్రీజేపీ ఎందుకు వెనక్కి తగ్గింది?
రైతు ఉద్యమం అలాగే కొనసాగితే త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని బీజేపీకి అర్థమైంది. కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు అవే నివేదికలు ఇచ్చాయి. దీనితో ప్రధాని మోడీ వెనకడుగు వేయక తప్పలేదు.
మ్రుప్పు తప్పినట్టేనా?
ఎంతమాత్రం కాదు. మరో రూపంలో అవే చట్టాలను అమల్లోకి తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం కచ్చితంగా ప్రయత్నిస్తుంది. దానిపట్ల మేం అప్రమత్తంగానే ఉన్నాం.
హర్యానా-పంజాబ్ రాష్ట్రాల సమస్యల్ని బీజేపీ ప్రస్తావిస్తోంది కదా?
అవును...రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలను జటిలం చేసే ప్రయత్నం ఉద్యమ సమయంలో చేశారు. భూమి ఉంటేనే కదా, నీటి అవసరం. భూమే లేనప్పుడు నీళ్లు ఉన్నా ఏం చేసుకోవాలి? అనే ప్రశ్న రెండు రాష్ట్రాల రైతాంగాన్ని ఆలోచింపచేసింది. ఫలితంగా పంజాబ్-హర్యానా భాయి భాయి నినాదం రెండు రాష్ట్రాల మధ్య స్పర్థల్ని కనుమరుగు చేసి ఐక్యతను పెంపొందించింది. దాన్ని అలాగే కొనసాగిస్తాం.
ప్రధాని పంజాబ్ పర్యటనను అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది...
అది పూర్తిగా అవాస్తవం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వారికో రాజకీయ అజెండా కావాలి. దానికోసం ప్రధాని స్థాయి వ్యక్తి ప్రచారం కోసం అంతగా దిగజారాల్సిన అవసరం లేదు. ప్రధాని పర్యటన రూటును అకస్మాత్తుగా మార్చుకొని, ఉద్దేశ్యపూర్వకంగానే హైడ్రామా సృష్టించారు. ప్రజలకు ఇప్పటికే వాస్తవం అర్థమైంది.
భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
జనవరి 15వ తేదీ ఢిల్లీలో సంయుక్త కిసాన్‌మోర్చా జాతీయ నాయకత్వ సమావేశం ఉంది. దానిలో అన్ని అంశాలనూ చర్చిస్తాం. రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత, ఎమ్మెస్పీ చట్టం డిమాండ్ సాధన సహా అన్నీ మా అజెండాలో ఉన్నాయి. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తాం.