Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరువు హత్య కేసులో నిందితురాలికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అవంతిక, హేమంత్ కుమార్‌లు ప్రేమించి పెండ్లి చేసుకుని హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాపురం పెట్టారు. వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల తమ పరువు పోయిందంటూ అవంతిక బంధువులు ఒక పథకం ప్రకారం హేమంత్‌ను కిడ్నాప్ చేసి హతమార్చారని పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని అవంతిక తల్లి, మూడో నిందితురాలు డి అర్చన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత ఆమోదించారు. ఆమె బెయిలుపై విడుదలైతే, సాక్ష్యాలను తారుమారు చేస్తారనీ, కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముంటుందన్న పోలీసుల వాదనను తోసిపుచ్చారు. బంధువులకు ఫోన్లు చేసినట్టు, ఒక స్థలం బదలాయింపు వంటి ఆరోపణలు మాత్రమే ఉన్నాయనీ, బెయిల్ ఇవ్వాలని అవంతిక తరపు లాయర్ వాదనను కోర్టు ఆమోదించింది. రూ.20 వేల విలువ ఉన్న రెండు పూచీకత్తులను సమర్పించాలనీ, కింది కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. అన్ని వాయిదాలకూ హాజరుకావాలనీ, కోర్టులో కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎల్బి నగర్ పీఎస్ పరిధిలోనే ఉండాలని సూచించింది, గచ్చిబౌలి, రామచంద్రాపురం పీఎస్ పరిధిల్లోకి వెళ్లకూడదని షరతులు పెడుతూ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.