Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శికి కార్మిక సంఘాల జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పెంచిన 30 శాతం వేతనాన్ని జీహెచ్ఎంసీ కార్మికులకూ వర్తింపజేయాలని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్‌లో పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌కు జేఏసీ బృందం వినతిపత్రాన్ని అందజేసింది. ఈ నెల ఆరో తేదీన మున్సిపల్ కార్మికులకు 30 శాతం వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జీఓ నెంబర్ నాలుగును విడుదల చేసిందని తెలిపారు. ఈ జీఓ రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలకు వర్తిస్తుందని పేర్కొంటూ జీహెచ్ఎంసీ కార్మికులను మాత్రం చేర్చలేదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై 30 శాతం పెంచుతూ ప్రత్యేక ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పాలడుగు భాస్కర్, జె.వెంకటేశ్(సీఐటీయూ), జయచంద్ర, ఏసురత్నం(ఏఐయూటీసీ), శివబాబు(ఐఎఫ్టీయూ), బోసు(టీఎస్టీ యూసీ), జైపాల్‌రెడ్డి(ఏఐటీయూసీ), తదితరులు పాల్గొన్నారు.