Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 23,24 తేదీల్లో కార్మికులు చేపట్టేది దేశభక్తి సమ్మె
- కార్మికులు ఐక్యంగా ఉంటేనే అనుకూల విధానాలు సాధ్యం
- పార్లమెంటరీ సీపీఐ పక్ష నేత బినొరు విశ్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆత్మనిర్భర్ భారత్ అంటూ అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్లకు దేశ సంపదను అమ్మేయడమేంటి? అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంటరీ సీపీఐపక్ష నేత, ఆలిండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు బినొరు విశ్వం ప్రశ్నించారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలనీ, నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలనీ, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 23,24 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మికులు నిర్వహించేబోయే సమ్మె దేశభక్తి యుతమైనదని నొక్కి చెప్పారు. ఆ చారిత్రక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వం మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల బిల్లును అడ్డుకున్నందుకు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ పెట్టుబడుల ఉపసంహరణను పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు తనతోపాటు మరో 11 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడమే తప్పా? అని ప్రశ్నించారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని కార్మిక లోకం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతు, కార్మిక వర్గ ఐక్యత రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మోడీ సర్కారు కీలకమైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో సైతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్న ప్రభుత్వమని విమర్శించారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.బోస్, ఆలిండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోనల్ సెక్రెటరీ వి.రఘునాథ్, జోనల్ జాయింట్ సెక్రెటరీ పి.మహేశ్, జీఐసీ జాయింట్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కన్వీనర్ వై.సుధాకరరావు, ఫెడరేషన్ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, గంగరాజు, నగర కార్యదర్శి ఎ.ముత్యాలు,తదితరులు పాల్గొన్నారు.