Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లోనే విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన
- డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి వెల్లడి
- డిజిలాకర్‌లో డేటాను పొందుపరుస్తాం : లింబాద్రి
- వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టడమే ప్రధాన లక్ష్యమని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల అకడమిక్‌కు సంబంధించిన ధ్రువపత్రాలను ఆన్లైన్లోనే పరిశీలన జరుగుతుందని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో ఉన్నత విద్యామండలి, డీజీపీ సంయుక్త సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నకిలీ సర్టిఫికెట్ల బెడద లేకుండా చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని గుర్తు చేశారు. అందుకనుగుణంగా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. డిజిలాకర్ ద్వారా నేషనల్ అకడమిక్ డిపాజిటరీతో కలిసి పనిచేయాలని సూచించారు. వీలైనంత త్వరగా డేటాను అప్లోడ్ చేయాలని వీసీలను కోరారు. డిజిలాకర్‌పై పని పురోగతిలో ఉండగా, అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి డేటాను నవీకరించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో సమాంతర వ్యవస్థను కలిగి ఉండాలన్నారు. డేటా ఉత్పత్తి సమయంలో ఆటోమేటిక్ డేటా క్యాప్చర్‌ను సాధించడానికి రాష్ట్రస్థాయిలో సర్వర్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల సర్వర్ల మధ్య డేటాను మెషిన్ నుంచి మెషిన్ మార్పిడికి అవకాశముండాలని సూచించారు. నకిలీ సర్టిఫికెట్లు దొరికినప్పుడల్లా పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీలను కోరారు. ప్రపంచస్థాయిలో విశ్వవిద్యాలయాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటి చిత్రాలను రూపొందించాలని సూచించారు. అధ్యక్షత వహించిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ విద్యార్థుల ధ్రువపత్రాలను ఆన్లైన్లో పరిశీలించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పారు. డేటాను నవీకరించడానికి ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలను బలోపేతం చేయాలని వీసీలను కోరారు. డిజిలాకర్‌లో పదేండ్లకు సంబంధించిన డేటాను పొందుపరుస్తామని అన్నారు. అందుకనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను బలోపేతం చేస్తామన్నారు. త్వరలోనే ఐటీ శాఖ అధికారులు, డీజీపీ కార్యాలయంలో ఐటీ విభాగం, వర్సిటీల్లోని ఐటీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలనకు కావాల్సిన సహకారాన్ని అందిస్తామన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన వ్యవస్థను పటిష్టం చేసేందుకు వర్సిటీలు చర్యలు చేపట్టాలని కోరారు. ఉన్నత విద్యామండలి కన్సల్టెంట్ ఎ సదానందం మాట్లాడుతూ ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, వర్సిటీల వీసీలు డి రవీందర్, కట్టా నర్సింహ్మారెడ్డి, టి రమేష్, సిహెచ్ గోపాల్‌రెడ్డి, కె సీతారామారావు, లక్ష్మికాంత్‌రాథోడ్, రవీందర్‌గుప్తా, ఎన్ కవితా దర్యానీరావు తదితరులు పాల్గొన్నారు.