Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐవైఎఫ్ మహాసభలు ముగింపు సభలో సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత బినొరు విశ్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక బిజెపిని ఓడించడం ద్వారా దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత బినొరు విశ్వం అన్నారు. అందు కోసం ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద శక్తులకు అడ్డుకట్ట వేసి లౌకికశక్తులను గెలిపించాల్సిన తక్షణ కర్తవ్యం ఏఐవైఎఫ్ ముందన్నారు. హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా కొనసాగిన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ముగింపు సభలో బినొరు విశ్వం మాట్లాడుతూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్న దేశం యువత వైపు చూస్తున్నదన్నారు.
బడుగు బలహీనవర్గాలు, శ్రామికవర్గం కోసం, మెరుగైన భారతదేశ నిర్మాణం కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ భారతం యువతదేనన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు, న్యాయం కోసం యువత మార్కిస్టు భావజాలాన్ని మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. యువజన సమాఖ్యకు వీరోచిత పోరాటాల చర్రిత ఉందనీ, నేటి తరం నాయకత్వం ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే సమకాలీన సమస్యలపై ఉద్యమించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా మీడియాను సద్వినియోగం చేసుకుంటూనే సమస్యలపై జరిగే ఉద్యమాల్లో కూడా క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని కోరారు. ఉద్యమంలో ఎదురవుతున్న సమస్యలను అదిగమిస్తూ యువజన సమాఖ్యను మరింత బలోపేతం చేయాలన్నారు. సభలో ఏఐవైఎఫ్ అధ్యక్షులు అఫ్తాబ్ అలీ ఖాన్, ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై రామన్ తదితరలు ప్రసంగించారు.
నూతన నాయకత్వం ఎన్నిక
అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) జాతీయ నూతన అధ్యక్షులుగా సుఖ్జిందర్ మహేసరి (పంజాబ్), ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఆర్.తిరుమలై రామన్ (తమిళనాడు) ఎన్నికయ్యారు. సమాఖ్య నూతన నాయకత్వాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 105 మందితో జాతీయ సమితిని, 35 మందితో వర్కింగ్ కమిటీని మహాసభ ఆమోదించింది. ఏఐవైఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులుగా వలీఉల్లా ఖాద్రీ (తెలంగాణ), అబాకష్ సాహూ (ఒడిషా), అమృతా పాటక్ (ఢిల్లీ), కార్యదర్శులుగా టి.టి.జిస్మోన్ (కేరళ), ఎన్.లెనిన్ (ఆంధ్రప్రదేశ్), ఎం.అనిల్ కుమార్ (తెలంగాణ), రోషన్ సిన్హా (బిహార్) ఎన్నియ్యారు.