Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టుల బలం పెరిగితేనే పేదలకు రక్షణ
- సీపీఐ(ఎం) రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలో..
- రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
- రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శిగా మూషం రమేష్
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
బడాకార్పొరేట్లకు ఊడిగం చేయడమేగాక.. మతవైషమ్యాలను రెచ్చగొడుతూ దేశ సమైక్యతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భంగం కలిగిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. కమ్యూనిస్టుల బలం పెరిగితేనే పేదలకు రక్షణ ఉంటుందనీ, దేశ సమైక్యత, సమగ్రత కోసం దేశభక్తులుగా కమ్యూనిస్టు కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో కామ్రేడ్ పసుల మారుతినగర్లో సీపీఐ(ఎం) రాజన్న సిరిసిల్ల జిల్లా 2వ మహాసభలు ఈ నెల 9, 10 తేదీల్లో ఉత్సాహంగా జరిగాయి. సభా ప్రారంభానికి ముందు సీనియర్ నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళి అర్పించారు. గన్నేరం నర్సయ్య, కోడం రమణ, జవ్వాజి విమల అధ్యక్షతన మహాసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. బీజేపీకి కరోనా సంక్షోభాన్ని శాస్త్రీయంగా అరికట్టే చిత్తశుద్ధి లేదన్నారు. కరోనా కాలంలో కష్టజీవులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కార్పొరేట్ల ఆదాయాలు భారీగా పెరిగాయని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ముప్పు తెస్తుందన్నారు. రాష్ట్రాలహక్కులు కాలరాస్తూ కేంద్రం పెత్తనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం.. 750 మంది రైతుల ప్రాణత్యాగం, రైతుల ఐక్య పోరాటంతో మోడీ సర్కారు తోకముడిచి క్షమాపణలు చెప్పి, చట్టాలు వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. రైతుల ధాన్యం కొనుగోళ్లలో డబుల్ గేమ్ ఆడుతూ బీజేపీ, టీఆర్ఎస్ ప్రజలను పక్కదోవ పట్టించాయని విమర్శించారు. కనీస మద్దతు ధర వచ్చేవరకూ సీపీఐ(ఎం) పోరాడతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య పెరిగి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదనీ, కనీస మానవీయత ప్రదర్శించరా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటిస్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతు సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఓ వైపు ఎంపీ, మరోవైపు మంత్రి చుట్టం చూపులా వచ్చి పోతారు కానీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి ప్రసంగించారు.
జిల్లా కార్యదర్శిగా రెండోసారి మూషం రమేష్
సీపీఐ(ఎం) రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా మూషం రమేష్ రెండవసారి ఎన్నికయ్యారు. 13 మందితో జిల్లా కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. జిల్లా కమిటీ సభ్యులుగా ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, ఎం.అరుణ్, ఎర్రబెల్లి నాగరాజు, గన్నారం నర్సయ్య, అన్నల్దాస్ గణేష్, జవ్వాజి విమల, ముక్తికాంత అశోక్, జీ.శ్రీధర్, శ్రీరామ్ సదానందం, ఎం.ప్రశాంత్, సురం పద్మ ఎన్నికయ్యారు.