Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి టీఆర్ఎస్ సవాల్
- మా రాష్ట్రంలోని పథకాలు మీ దగ్గర అమలవుతున్నాయా? : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నల్ల చట్టాలను ప్రజలపై, రైతులపై బలవంతంగా రుద్దటంలో కాదు... అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన గణాంకాలతో కూడిన శ్వేతపత్రాలను విడుదల చేయటంలో పోటీ పడదాం, రాజకీయంగా కాకుండా అలాంటి అంశాలపై పరస్పరం పోరాడుదాం దీనికి మీరు సిద్ధమేనా...?' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్... బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. మీమీ రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా..? అని వారిని సూటిగా ప్రశ్నించారు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు ఇటీవల వరసగా ఇక్కడకు రాజకీయ పర్యాటకుల్లాగా వచ్చిపోతున్నారు.. వారందరికీ స్వాగతమంటూ విమర్శించారు. అయితే అలా వచ్చిన వారు వాస్తవాలను విస్మరించి, తమ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిందిస్తున్నారని విమర్శించారు. ఇది సరికాదని హితవు పలికారు. ఎన్డీఏ అంటే 'నో డేటా అవైలబుల్ ప్రభుత్వం...' అని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో... రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకూ రూ.50 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన తెలిపారు. తద్వారా 65 లక్షల కుటుంబాలు లబ్ది పొందాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా నిర్వహించిన సంబురాలను సంక్రాంతి దాకా పొడిగిస్తున్నామని చెప్పారు. కార్యకర్తలందరూ విధిగా కరోనా నిబంధనలను పాటిస్తూ వీటిని నిర్వహించాలని సూచించారు. టీఆర్ఎస్ను 'తెలంగాణ రైతు సర్కార్' అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. తమ ప్రభుత్వం రూపొందించిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 1.8 శాతంగా ఉన్న ప్రాథమిక రంగాల వృద్ధిరేటు... ఇప్పుడు ఎనిమిది శాతానికి పెరిగిందని వివరించారు. ఒకప్పుడు తెలంగాణలో భూములను అమ్ముతామంటే కొనేవారే లేరు.. ఇప్పుడు వాటి ధరలు అమాంతం పెరిగి, రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం సాధించిన విజయాలు శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌లకు పాఠ్యాంశాలుగా మారాయని తెలిపారు. రైతు బంధు డబ్బులు ఇటు కాంగ్రెస్ నేతలు, అటు బీజేపీ నాయకుల అకౌంట్లలోనూ పడుతున్నాయని చెప్పారు. అయినా వారు ఆ పథకాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 70 వేల మంది రైతు కుటుంబాలకు రైతు బీమాను వర్తింపజేశామని వివరించారు. ఇందుకోసం రూ.3,205 కోట్లను ప్రీమియంగా చెల్లించామని చెప్పారు. 2014 నుంచి 2018 వరకు మొత్తం రూ.16,144 కోట్లను రుణమాఫీ కోసం విడుదల చేశామని తెలిపారు. ఇప్పుడు కూడా దశలవారీగా దాన్ని అమలు చేస్తామని హామీనిచ్చారు. ఇప్పటి వరకూ వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కోసం మొత్తం రూ.2.71 లక్షల కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని కేటీఆర్ వివరించారు. తద్వారా వ్యవసాయం, పశుసంపద వృద్ధి, పాల దిగుబడి, చేపలు, మాసం ఉత్పత్తుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, ఆ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవటం సరికాదని ఆయన హితవు పలికారు.