Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణి ఆపరేటర్లకు సర్కారు సరిగ్గా జీతమిస్తలేదు..
- రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో
- అరకొర జీతాన్నీ ఆలస్యంగా ఇస్తుండటంతో ఇబ్బందుల్లో ఆపరేటర్లు
- ప్రత్యామ్నాయ సిబ్బంది లేక ఇక్కట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధరణి ఆపరేటర్లకు రాష్ట్ర సర్కారు సరిగ్గా జీతాలిస్తలేదు. ఒక్కో జిల్లాలో రెండు నుంచి మూడు నెలల పాటు పెండింగ్‌లో పెడుతు న్నది. ఇచ్చే అరకొర వేతనాన్నీ ఆలస్యంగా ఇస్తుండటంతో ఆపరేటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారి తుమ్మనా, దగ్గినా తమ ఉద్యోగం ఎక్కడో ఊడిపోతుందో అన్న భయంతో తమ గోసను ఎవ్వరికీ చెప్పుకోలేక ఆపరేటర్లు అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణిపోర్టల్‌ను తీసు కొచ్చింది. దాని నిర్వహణకుగానూ రాష్ట్ర ప్రభుత్వం 574 మంది ధరణి ఆపరేటర్లను నియమించింది. వీరంతా ఉన్నత చదువులు చదివి కంప్యూటర్‌పై అపార పరిజ్ఞానం కలిగినవారే. ఎంత ఎదురు చూసినా నోటిఫికేషన్లు రాక, ఇంటి దగ్గర ఆర్థిక సమస్యలు వెన్నాడుతుండటంతో ఆ కొలువులో చేరిన వారే ఎక్కువ. వీరికి మొదట రాష్ట్ర ప్రభుత్వం రూ.9,919 వేతనాన్ని ఇచ్చింది. ఇటీవల కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పెంచడంతో వీరి వేతనం రూ.11,070కి చేరింది. ఇంత తక్కువ వేతనంతో ఒక కుటుంబం ఎలా బతుకుందో ఏలికలకే తెలియాలి. ఇచ్చే ఆ అరకొరవేతనాన్నీ రాష్ట్రసర్కారు నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నది. ఆ సిబ్బంది కంతా కలిపితే అయ్యే జీతం అక్షరాల రూ.63,54,180 మాత్రమే. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తొమ్మిది నెలల కాలంలో పొందిన ఆదాయం రూ.6,830కోట్లు. ఈ ఆదాయం సమకూర్చిపెట్ట డంలో ధరణి ఆపరేటర్లదీ కీలక పాత్రే. రిజిస్ట్రేషన్ల ఎంట్రీలు చేసేది వీరే. వీరు ఎంట్రీలు చేసిన తర్వాత తహసీల్దార్ ఫైనల్ చేస్తే రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ఇంత పని చేస్తున్న వారికి ఆ ఆదాయంలో నుంచి ఏ నెలకానెల జీతం ఇవ్వడానికి మాత్రం సర్కారుకు చేతులు రావడం లేదు. ఈ నెల ఏడో తేదీ వరకు మూడు నెలల జీతాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఆపరేటర్లు గగ్గోలు పెట్టడంతో ఏడో తేదీ నవంబర్ నెల వేతనాన్ని విడుదల చేసింది. ఇంకా రెండు నెలల జీతం బకాయే ఉంది. లక్షలకు లక్షలు జీతాలు పొందేవారికి నెల మొదటి వారంలోనే జీతాలిస్తూ మా వేతనాలను మాత్రం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం సరిగాదు' అని ఓ ధరణి ఆపరేటర్ వాపోయాడు. పేరు రాయొచ్చా అని అడిగితే.. 'అమ్మో ఈ చిన్న కొలువు కూడా పోతది. రాయకండి' అని అన్నాడు. కొందరు ఆపరేటర్లు అయితే అడిగితే సమాధానాలు కూడా చెప్పడానికి భయపడుతున్నారు.
ఒక్కరే..అన్నీ తిప్పలే...
వేతనాలే కాదు..పనిప్రదేశంలోనూ వీరు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9:30 గంటలకు ఠంఛన్‌గా తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి ందే. 10:30 గంటల వరకు పోర్టల్‌లో లాగిన్ కావాల్సిందే. లేదంటే అధికా రుల వేధింపులకు గురికావాల్సిందే. వీరి స్థానంలో ప్రత్యామ్మాయ ఉద్యోగులు లేరు. దీంతో బంధులు చనిపోయినా, ఇంటి దగ్గర ముఖ్యమైన పని ఏది ఉన్నా కచ్చితంగా ఆఫీస్‌కు హాజరుకావాలి. సర్వర్ స్లోగా ఉండటం కూడా వారికి సమస్యగా మారింది. టెక్నికల్ సమస్యలు షరామామూలే. ఏరోజుకారోజు బుక్ అయిన స్లాట్లకు సంబంధించిన వివరాలను పొందుపర్చాలి. సాయంత్రం ఎంత లేటైనా పని ముగించుకునే పోవాలి. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ ధరణి ఆపరేటర్ రాత్రి వరకు విధులు నిర్వర్తించి వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు.