Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, టీఆర్ఎస్పై రేవంత్ ఆగ్రహం
- కేంద్రం ఆమోదించిన జీవో 317పౖౖె దీక్షలెందుకంటూ బీజేపీకి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జీవో 317ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల్లో చీలిక తేవడం ద్వారా చెరో వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు మహేశ్‌కుమార్, అంజన్‌కుమార్, మహేశ్వర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, మల్లు రవితో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. ''రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేస్తున్నది. ఇక్కడి ప్రభుత్వం పంపితేనే రాష్ట్రపతి వాటిని ఆమోదించారు. 317 జీవోలో తప్పు ఉందంటే...దాన్ని ఆమోదించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది? దాన్ని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారంటే...ఆ తప్పుకు కేంద్ర ప్రభుత్వానిది బాధ్యత కాదా? బీజేపీ ప్రోత్సహం వల్లే సీఎం కేసీఆర్ జీవోను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 317 జీవోలో తప్పులున్నాయని గుర్తించి సవరించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి అది కష్టమైన పని కాదు. ఈ జీవో ద్వారా తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరుగుతుంది.దీనిపై తక్షణమే స్టే ఇవ్వండి. కేంద్ర హోంమంత్రికి బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నది' అని నిలదీశారు. ఇదంతా చేసిన బీజేపీయే ఇప్పుడు 317 జీవోను సవరించాలంటూ పోరాటాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజరు పోరాటాలు చేయాల్సిన పని లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా జీవోల్లో మార్పులు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవడం లేదన్నారు.