Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండ్లీడు వయస్సు పెంపుతో విద్యా, వైద్యం వస్తదా?
- ఆడపిల్లను కాపాడాలి..సంరక్షించాలన్న నినాదం గాలికి
- పౌష్టికాహారాన్ని అందించటంలో కేంద్రం విఫలం : రౌండ్‌టేబుల్ సమావేశంలో ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాలికల వివాహ వయస్సును 18ఏండ్ల నుంచి 21ఏండ్లకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో వారికి విద్యా, వైద్యం సమకూరుతుందా?అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ప్రశ్నించారు. పెండ్లి వయస్సు పెంపు చర్య అనేది దేశంలో ఉన్న సకల సమస్యలను కప్పిపుచ్చేందుకేనని ఆమె వివరించారు. దేశంలో మహిళలకు ఎన్నో సమస్యలున్నాయన్నారు. తిండి లేక బాధపడుతున్న వారు, నిరుద్యోగంతో ఆవేదన చెందుతున్నవారు.. కోట్లాది మంది ఉన్నారని తెలిపారు.
ఈ సమస్యల పరిష్కారంలో విఫలమయిన మోడీ సర్కార్ ..పెండ్లి వయస్సును పెంచడం ద్వారా ఎలాంటి మహిళా సాధికారత సాధిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలను అప్రతిష్టపాలు చేసే ఈ చర్య మానుకోవాలని హితవు పలికారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనువాద సిద్ధాంతం అమలు చేసేందుకు వేగం పెంచిందని వివరిం చారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో 'మహిళల వివా హ వయస్సు పెంపు-ఆంతర్యం' అనే అశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మరియం మాట్లాడుతూ బుల్లిభారు యాప్ ద్వారా బీజేపీ ప్రముఖ ముస్లిం మహిళలపై బురదచల్లే చర్యలకు పాల్పడిందని విమర్శించారు. పైగా ఈ ఏడున్నర ఏండ్లలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతగల ప్రభుత్వం పెండ్లి గురించి కాదు..వారిని స్వయం పోషకులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. వారికి సరైన పౌష్టికాహారాన్ని అందించకుండా, అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించకుండా పెండ్లీడు వయస్సు పెంచినా..వారికి పుట్టే పిల్లలు బలహీనంగా పుడతారన్న విషయం ఈ సర్కారుకు తెలియదా? అని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి కాలంలో పేద వర్గాల పిల్లల చదువులు సరైన సౌకర్యాలు లేక మధ్యలోనే ఆగిపోయాయని తెలిపారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటమేగాక, సర్వం ప్రయివేటీకరణలో భాగంగా విద్యా రంగాన్ని ప్రయివేటీకరించటంతో పేద వర్గాలకు చదువు దూరమయిందని చెప్పారు. దీంతో 25శాతం ఆడపిల్లలు ఐదారు తరగతులతోనే మానేస్తున్నారని వివరించారు. దేశంలో 80శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారనీ, ఆకలి, దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నారనే విషయాన్ని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.వీటిపై చర్చించకుండా..రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పెండ్లీడు వయసుపై చర్చ చేయటంలో వీరి కపటత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఆర్ఎస్ఎస్, మనువాద సిద్దాంతాన్ని అమలు చేసే కర్తవ్యంలో భాగంగా బీజేపీ ఇలాంటి విధానాలను మోడీ సర్కార్ ఎజెండా మీదకు తెస్తుందని చెప్పారు. తమకిష్టమైనవారిని పెండ్లి చేసుకునే ఐచ్ఛిక వివాహాలను మరింత లక్ష్యంగా పెట్టుకోవడానికే ఈ వివాహ వయస్సు పరిమితి పెంపునకు పూనుకున్నారని తెలిపారు. తనకిష్టమైన వారిని పెళ్ళి చేసుకోవడానికి ఇప్పటికే తీవ్ర అడ్డంకులు ఎదుర్కొంటున్న యువతులు లైంగికతను నియంత్రించేందుకు ఇదొక మార్గంగా ఉంటుందన్నారు. లింగ సమానత్వం కోసం మహిళల వివాహ వయస్సును పెంచుతున్నామంటూ చేస్తున్న వాదన పూర్తిగా తప్పేనన్నారు. ఐద్వా జాతీయ నాయకులు ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ వ్యక్తిగత సంబంధాల విషయంలో మహిళా సాధికారతను ప్రభుత్వం అంతగా కోరుకుంటే కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక చట్టం చేయవచ్చుకదా? అని ప్రశ్నించారు.
గృహహింసం చట్టాన్ని ఎందుకు నీరుగారుస్తున్నారో చెప్పాలన్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఒక మహిళ వయోజనురాలిగా పరిగణింపబడుతుందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక వయోజనురాలైన యువతి చట్టబద్దంగా తన ఇష్ట ప్రకారం భాగస్వామిని ఎంచుకునే స్వయం ప్రతిపత్తి సూత్రానికి ఈ బిల్లు విరుద్ధమని తెలిపారు. పౌష్టికాహార లోపం, మాతా శిశు మరణాలు లాంటి ముఖ్యమైన సమస్యలు రాజకీయ విధానాలకు సంబంధించిన విషయాలని చెప్పారు. సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ మోడీ ఆయన అనుయాయులకు ప్రేమ, పెండ్లీల గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. మరియం ధావలే ఉపన్యాసాన్ని ఐద్వా రాష్ట్ర నాయకురాలు సమీనా అప్రొజ్ తెలుగులోకి అనువదించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు బి హైమావతి, బుగ్గవీటి సరళ, టీపీఎస్కే కన్వీనర్ కె హిమబిందు, వెంకటరెడ్డి, ప్రభావతి, ఇందిర, విమల, భారతి, నాగలక్ష్మి, శశికళ తదితరులు పాల్గొన్నారు.