Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- చార్మినార్ ప్రభుత్వ యూనానీ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం
నవతెలంగాణ-ధూల్‌పేట్
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని, కరోనా వ్యాధితో ప్రాణాల మీదికి వచ్చాక బాధపడటం కంటే రాకముందే టీకాతీసుకోవడం మేలు అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రభుత్వ యునానీ ఆస్ప్రతిలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి ఫ్రంట్‌లైన్ వారియర్స్ కోసం బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్ వేసుకోవడం, మాస్క్ ధరించడం ప్రధాన అస్త్రాలు అని తెలిపారు. హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు, 60ఏండ్లు దాటిన వారికి బూస్టర్‌డోస్ అందజేస్తామ న్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ వైద్య ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. మొదటి డోస్ సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చాలా సహకారం అందించారన్నారు. 15-18 ఏండ్ల మధ్యవారిలో వారం వ్యవధిలో 38 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని వివరించారు. వ్యాక్సినేషన్ ద్వారా జ్వరం వస్తుందని ఆందోళన చెందొద్దన్నారు. యునానీ ఆస్పత్రి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. ఆస్పత్రిలో ఒకటి, రెండు రోజుల్లో వైద్యుల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నిధుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన మంజూరయ్యేలా చేస్తామన్నారు. టీచింగ్ స్టాఫ్‌గా కొనసాగుతున్న డాక్టర్లందరూ పేషెంట్లకు వైద్య సేవలు అందజేయాలని కోరారు. రోగులకు ఇక్కడే వైద్యసేవలు అందజేస్తే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని.. దాంతోపాటు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు, టీఎస్ ఎంసీఐ సీఐడీసీ అధికారి శ్రీనివాస్, ఆయూష్ కమిషనర్ డాక్టర్ వర్షిని, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మొహమ్మద్ భాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, మోజం ఖాన్, చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ అధికారులు పాల్గొన్నారు.