Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆకాంక్షలు నెరవేరుస్తాం : కేరళ ఆర్థిక మంత్రి కె బాలగోపాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిధుల కేటాయింపుల్లో రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపు తున్నదని కేరళ ఆర్థిక మంత్రి కె బాలగోపాల్ విమర్శించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో మోడీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదన్నాని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో సీపీఐ(ఎం) రెండోసారి అధికారంలోకి రావడంతో రైతుల ఆకాంక్షలు పెరిగాయని చెప్పారు. వాటిని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ,రైతు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ప్రారంభమైన ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లా డారు. కేంద్ర ప్రభుత్వం విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు మరింత ఇబ్బందిపడున్నారని చెప్పారు. కేరళలో అత్యధికంగా సాగవుతున్న కొబ్బరి, కాఫీ తోటల రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వాటితోపాటు పాడి, కోళ్ల పరిశ్రమ, పండ్లు, కూరగాయలు, చేపల పెంపకం అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామన్నారు.
కేరళలో వరి ధాన్యం కిలోకు రూ28ల మద్దతు ధర కల్పిస్తున్నామని బాలగోపాల్ ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు అదనంగా వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తున్నామని వివరించారు. 16 రకాల కూరగాయలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుధర కల్పించింద న్నారు. వ్యవసాయ సబ్సిడీ కోసం రూ రెండువేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. సూక్ష్మతరహా నీటిపారుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్, ప్రాసెసింగ్ విధానాలతో రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. సాగుకు అవసరమైన యంత్రాల కోసం రైతులకు 25శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. వ్యసాయాభివృద్ధికి కేరళప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలవల్ల యువ రైతులుసైతం వ్యవసాయంవైపు ఆకర్షితులవుతున్నా రని తెలిపారు. చికెన్ దిగుమతిని తగ్గించుకుని.. కేరళ చికెన్ పేరిట రైతులను ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. సన్న, చిన్న కారు రైతులను ప్రోత్సహించేలా సహ కార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. కరోనా సమయంలోనూ రైతులకు అండగా ఉన్నామని చెప్పారు. రైతుసంక్షేమ నిధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు.