Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధరల చట్టమే ధ్యేయంగా ముందుకు..
- విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తిప్పికొట్టేందుకు కార్యాచరణ
- ఉత్తేజంగా ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ ప్రారంభం
- అరుణ పతాకాన్ని ఎగురవేసిన అశోక్ ధావలే
- పోరాట యోధులకు నివాళి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమరం సాధించే దిశగా అఖిలభారత కిసాన్‌సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాగు చట్టాలను వెనక్కి కొట్టిన రైతాంగాన్ని అభినందిస్తూనే...కనీస మద్దతు ధరల చట్టం లక్ష్య సాధన కోసం ఈసమావేశాల్లో ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే సాగు కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే, విద్యుత్ సవరణ బిల్లును తెచ్చి రైతాంగానికి భారం మోపే కేంద్ర ప్రభుత్వం చర్యలను వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. దేశంలో రైతులు ప్రయివేటు అప్పుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేరళ తరహాలో రుణ విమోచన చట్టం తీసుకరావాలనే డిమాండ్ తెచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఉత్తేజంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా అరుణ పతాకాన్ని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే ఎగురువేశారు. ఏఐకేఎస్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, అమరవీరుల ఆశయాలను సాధిస్తాం అంటూ ఏఐకేఎస్ కేంద్ర కమిటీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం ప్రారంభమైన సమావేశాల్లో ఇటీవల మరణించిన వారికి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమాల్లో అసువులుబాసిన నేతలు గౌతమ్ దాస్, బిజన్ధార్, దినానాథ్సింగ్, ప్రమీలపాండే, సుదర్శన్రారు చౌదరి, రతన్ బుధార్ వీరితోపాటు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన రైతాంగ ఉద్యమ సందర్భంగా మరణించిన 700 మంది రైతులకు సంతాపం, వారికి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ, సంతాపం తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సాగు భారమై ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కు, ప్రజావ్యతిరేక విధానాలపై జరిగిన ప్రజా ఉద్యమాల్లో మరణించిన వారి కి, కరోనా బారిన పడిన చనిపోయినవారికీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్ఎస్ ఎస్ దాడుల్లో చనిపోయిన నేతలకు సంతాపం తెలుపుతూ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్దావలే అధ్య క్షతన ప్రారంభమైన సమావేశాల్లో జాతీయ కార్యదర్శి హన్నన్‌మొల్లా కార్య కలాపాల నివేదికను ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలను ప్రస్తావించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సరళీకరణ విధానాలను వేగ వంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో వాటి ప్రభావం సన్న,చిన్నకారు రైతు లపై ఎలా పడుతుందో వివరించారు. వేదికపై ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్య క్షులు సారంపల్లి మల్లారెడ్డి, జాతీయ సహాయ కార్యదర్శి విజ్జుకృష్ణన్, కృష్ణ ప్రసాద్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఉన్నారు. దేశ నలుమూల నుంచి వచ్చిన వంద మంది రైతాంగం ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.