Authorization
Sat April 12, 2025 05:55:51 am
- మరో తెలంగాణ సాయుధ పోరాటం
- ప్రధాని పంజాబ్ పర్యటన 'జుమ్లా బాజీ'
- ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: అఖిలభారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్‌ధావలే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిపాటు శాంతియుత, లౌకిక రైతాంగ ఉద్యమం జరిగింది..పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి మరో రూపమిది..500 సంఘాల ఐక్యతతోనే విజయం..గతంలో ఎప్పుడూ జరగనిది..భౌతికశక్తితోనే సంఫ్‌ుపరివార్ శక్తుల దుష్పప్రచారానికి అడ్డుకట్ట..సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం)ను వీడితే రైతు వ్యతిరేకులనే ముద్ర పడే పరిస్థితి ఉత్పన్నమైంది.. లక్షల మంది పేద, మధ్య తరగతి రైతుల ఉద్యమానికి ధనికులూ మద్దతిచ్చారు..వర్కింగ్ క్లాస్ సహకారం అద్భుతం.. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని' అఖిల భారత కిసాన్ సభ(ఏఐకెఎస్) జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే అన్నారు. ఆ సంఘం జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బి.బసవపున్నయ్యకు సోమవారం పత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...
రైతాంగ ఉద్యమ విజయానికి కారణాలేంటి ? ఎన్ని సంఘాలు పాల్గొన్నాయి ?
ఢిల్లీ రైతాంగ ఉద్యమ విజయానికి ఐక్యతే కీలకం. ఈ పోరాటానికి స్ఫూర్తి 2017, జూన్‌లో మల్సోర్ పోలీస్ ఫైరింగ్‌లో ఆరుగురు రైతులు చనిపోవడం. ఆ ఘటనే అన్ని సంఘాల సమన్వయానికి కారణం. తొలుత 250 సంఘాలతో అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ(ఏఐకెఎస్‌సీసీ) ఏర్పడింది. ఈ సంఘం నాయకత్వంలో 2018 నవంబరులో లక్ష మంది రైతులతో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాం. అనంతరం లెఫ్ట్, రైట్ వింగ్‌తోపాటు మధ్యవర్తులతో నవంబరు, 27, 2020న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ఏర్పడింది. రైతుచట్టాల ఉపసంహరణ, ఎంఎస్పీ, విద్యుత్ బిల్లు ఉపసంహరణ తదితర ఎజెండాతో ఎస్‌కెఎం ఉద్యమించి విజయం సాధించింది. ఫలితాల సాధనకు మరో పోరాటం అవసరం రావచ్చు.
రైతాంగ ఉద్యమానికి తెలంగాణ సాయుధ పోరాటంతో పోలిక ఉందా ?
అవును. పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి మరో రూపమే ఢిల్లీ రైతాంగ ఉద్యమం. గతంలో ఎన్నడూ జరగనిది. చూడనిది. చివరకు ఎస్కెఎంను ఎవరైనా వీడాలనుకుంటే వారికి రైతు వ్యతిరేక ముద్ర పడే స్థాయికి ఉద్యమం ఎదిగింది. అదే ఆ పోరాటం గొప్పదనం, నైతికత.
కార్పొరేట్ మీడియాను ఎలా ఎదుర్కొన్నారు, సోషల్ మీడియా ఎలా ఉపయోగపడింది ?
రైతుల ఉద్యమాన్ని విభజించడానికి, అప్రతిష్టపాల్జేయానికి సంఫ్‌ుపరివార్ శక్తులతోపాటు అలాగే కార్పొరేట్ మీడియా కుట్రలకు పాల్పడింది. లక్షలాది మంది రైతులతో ఢిల్లీ నగరం ఆరు సరిహద్దులను ముంచెత్తాం. సోషల్‌మీడియాను బాగా వినియోగించుకున్నాం. 380 రోజుల(ఏడాది ఐదు రోజులు)పాటు ఉద్యమాన్ని నడిపాం. ఇలా కార్పొరేట్ మీడియాను నిలువరించాం. చివరకు ముజఫర్‌పూర్‌లో గత సంవత్సరం సెప్టెంబరు ఐదున 10 లక్షల మంది రైతులతో భారీ ర్యాలీ చేపట్టాం. అప్ప్పుడు కార్పొరేట్ మీడియా కూడా ప్రచారం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోనూ మహాధర్నా చేపట్టాం.
కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు ప్రత్యామ్నాయంతో ఉద్యమాన్ని నడిపారా ?
లేదు.లేదు.మరో ప్రత్యామ్నాం అంటూ ఏదీ లేదు. ఒకటే ఎజెండా. మోడీ సర్కారు మార్పులు, చేర్పులు చేస్తామన్న అంగీకరించలేదు. రైతుల కోసమేగాక దేశ ప్రజలందరికోసం పోరాడాం. కనీస మద్ధతు ధర, ప్రభుత్వ కోనుగోలు కేంద్రాలు, ఎఫ్‌సీఐ గౌడౌన్లు ఖాళీగా ఉండటం, పీడీఎస్ వ్యవస్థను నాశనం చేయడంపై అన్ని చోట్లా కేంద్రాన్ని నీలదీశాం. ఈనేపథ్యంలో ఎంఎస్పీ, రుణ విముక్తి బిల్లులు పార్లమెంటు ముందుకొచ్చాయి. తక్కువ వడ్డీతో రుణాలిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇది అగ్రిబిజినెస్ చేసేవాళ్లకు మాత్రమే లాభంచేశాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా కూడా కార్పొరేట్ కంపెనీలకే ఉపయోగపడింది.
ప్రధాని విజ్ఞప్తి మేరకే ఆందోళన విరమించారా ?
ఇందులో అసలు నిజం లేదు. ప్రధాని విజ్ఞప్తి చేసిన మూడు వారాల తర్వాత ఎస్‌కెఎం స్పందించింది. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే అంగీకరిస్తాం అని ఖరాఖండీగా చెప్పాం. తుదకు డిసెంబరు 11న ఓప్పందం జరిగింది. ఆ రోజును 'విక్టరీ డే'గా ప్రకటించాం. అ తర్వాతే ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు కదిలారు. ఈనెల 15న ఢిల్లీలో జరిగే ఎస్‌కెఎం సమావేశంలో భవిష్యత్ నిర్ణయాలు తీసుకోబోతున్నాం. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాం.
పంచాబ్లోని ఫిరోజ్పూర్లో అసలు ఏం జరిగింది, ప్రధాని ఎందుకు వెనక్కి వెళ్లారు ?
ప్రధాని ఫిరోజ్ఫూర్ పర్యటన సాంతం 'జుమ్లా బాజీ'. అదంతా నాటకం. ఆయన సభకు 70 వేల మంది వస్తారని భావిస్తే, 700 మంది కూడా రాలేదు. ఖాళీ కుర్చీలతో కనిపించిన వీడియోలే సాక్షం. ఆ సభ ఫ్లాఫ్షోగా మిగింది. దీంతో ఏకంగా ప్రధానమంత్రే నాటకానికి తెరలేపారు. సభ ఫెయిల్ కావడంతో అక్కడి రైతులు, ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు.