Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరవై గ్రామాలు, వేలాది ఎకరాల భూమిపై అధికార జులుం ప్రదర్శించే రామచెంద్రారెడ్డి తల్లి జానకీదేవికి, కోడలితో పొసగక కడివెండి గ్రామంలో స్థిరపడింది. ఆ పల్లె చుట్టూర పొలిమేర గ్రామాల్లో అరాచకం సృష్టిస్తూ పెత్తనం చేసే జానమ్మ.. కడివెండిని సైతం తన కాలుకింది చెప్పులా చూసేది. నిజాం పాలన, దొరల ఆగడాలపై ఏండ్లుగా విసుగెత్తిన జనం ఊరూరా 'సంఘం' పేరుతో చైతన్యమవుతుండగా కడివెండిలోనూ వెట్టిని ఎదిరించ ప్రజలు ఒక్కటయ్యారు.
పొలిమేర దాటి ఆ ఊరిల అడుగు పెట్టంగ
స్వాగతమంటూ ఉంటరు ఎర్రెర్రని
తోరణాలు.....
నిజానికి తోరణాలు కావవి.
నిజాం అరాచక పాలనపై..
నిప్పు రాజేసిన నేలమీద...
పోరు జెండలతోటి ఉద్యమదారి పట్టంగ..
సాగిన సమరానికి గుర్తులు ఆ అమరుల స్థూపాలు...
నేటి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఉన్న ఆ పోరుగడ్డ పేరు ''కడివెండి''. ఒకప్పుడు జగ మొండి జానకిదేవి (జానమ్మ) దుర్మార్గాలకు నిలయమైన పల్లెటూరు.
దేశంలోని ఆరునూర్ల సంస్థానల్లో పెద్దదైన హైదరాబాద్‌ను ఏలుతున్న ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్.. తెలంగాణ పల్లెల్లో పటేల్-పట్వారీలు, జాగీర్దార్లు- జమీన్ దార్ల ద్వారా పాలనా వ్యవహారాలు నడుపుతూ పన్నులు వసూలు చేసేవాడు. ఆనాడు అందరికీ ప్రధాన ఆధాయ వనరైన భూమిలో అధిక భాగం ఈ దేశ్‌ముఖ్‌లు, దొరలు, పటేళ్ల వద్దే ఉండేది. నిరంకుశత్వానికి మారుపేరైన వీరంతా... ప్రజల్ని క్రూరంగా హింసించి మరీ పన్నులు వసూలు చేసేవారు. ఇసోంటి యవ్వారాల్లో విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచెంద్రారెడ్డిది ముందు వరస. అరవై గ్రామాలు, వేలాది ఎకరాల భూమిపై అధికార జులుం ప్రదర్శించే రామచెంద్రారెడ్డి తల్లి జానకీదేవికి, కోడలితో పొసగక కడివెండి గ్రామంలో స్థిరపడింది. ఆ పల్లె చుట్టూర పొలిమేర గ్రామాల్లో అరాచకం సృష్టిస్తూ పెత్తనం చేసే జానమ్మ.. కడివెండిని సైతం తన కాలుకింది చెప్పులా చూసేది. నిజాం పాలన, దొరల ఆగడాలపై ఏండ్లుగా విసుగెత్తిన జనం ఊరూరా 'సంఘం' పేరుతో చైతన్యమవు తుండగా కడివెండిలోనూ వెట్టిని ఎదిరించ ప్రజలు ఒక్కటయ్యారు. పాలకుర్తి, కామారెడ్డి గూడెం, దేవరుప్పుల తదితర ప్రాంతాల్లో జరిగిన పరిణామాల స్ఫూర్తితో సంఘంగా కార్యక్రమాలు మొదలుపెట్టారు. గ్రామానికి చెందిన నల్లా నర్సింహులు, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి వంటి నేతల ఆధ్వర్యంలో.. అన్నికులాలవారు ఏకమై లెవీ చెల్లించేది లేదని, దౌర్జన్యాల్ని సహించేది లేదని అధికార్లకు ఎదురు తిరిగారు. దొరసాని ఇంట్ల వెట్టి పనుల్ని నిలిపేశారు. పనులు జరుగక జానమ్మ దేవిడి (ఇల్లు) కంపు లేసింది. కంపరంతో ఊగి పామై బుసకొట్టిన ఆ నరరూప రాక్షసి సంఘం చర్యల్ని సహించలేకపోయింది. గ్రామ పరిణా మాల్ని విసునూరులో ఉండే కొడుకు రామ చంద్రారెడ్డికి చేరవేసి గుండాలను పిలిపించింది. మోసంతో సంఘం నేతల్ని హతమార్చే పథకంతో కడివెండి చేరిన వారి సైన్యం.. విచ్చల విడిగా విందుచేసుకుని, మందారగించి గ్రామంలో దాడులకు దిగింది. విస్నూరు దొర మామ గడ్డం నర్సింహ్మారెడ్డి, పెద్ద గుమస్తా మస్కీన్ అలీ నేతృత్వంలోని గుండాల గుంపు.. కత్తులు, కటార్లు, బరిసెలతో మంగలి లచ్చమ్మ ఇంటిపై పడ్డది. అడ్డుకోకుంటే వారి అకృత్యాలు మితిమీరుతాయని భావించిన సంఘపోళ్లు నిమిషాల్లో ఒక్కచోట చేరి చేతిల గుత్పలు పట్టారు. దొరలకు వ్యతిరేకంగా గ్రామంలో భారీ ప్రదర్శన చేపట్టారు. గొర్లను కాసి ఇంటికి వచ్చిన దొడ్డి కొమురయ్య సైతం.. దుడ్డుకర్ర అందుకుని అన్న దొడ్డి మల్లయ్య చెంతకు చేరి ప్రదర్శనలో ముందుకు సాగాడు. ఆంధ్ర మహాసభకు జై, కమ్యూనిస్టు పార్టీకి జై అని నినాదాలు మార్మొగుతుండగా...ఊరేగింపు ఊరినడిబొడ్డుకు చేరింది. గుండెలదిరి దొరసాని గడి చేరిన గుండాలు నేరుగా... వారిపైకే తుపాకులు ఎక్కుపెట్టారు. ఒక్కపెట్టున కాల్పులకు దిగారు. దొడ్డి మల్లయ్య కాలుకు తూటా తగిలింది. అయ్యో.. అంటూ.... అన్నను అందుకునేందుకు కిందికొంగిన దొడ్డి కొమురయ్య పొట్టలోనుంచి మరో తూటా దూసుకెళ్లింది. అనేక మంది యోధులు గాయాలతో చిందిన ఆ నెత్తుటి మడుగులోనే... సంఘానికి జై అంటూ నేలకొరిగాడు దొడ్డి కొమరయ్య.
ఈ వార్త దావానలంలా చుట్టు పక్కల గ్రామాలన్నిటికీ పాకింది. వేలాది మంది ప్రజలు కడివెండికి తరలిరాగా...పోలీసుల సాయంతో దేశ్‌ముఖ్ గుండాలు ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోయారు. కడివెండి జనసంద్రం కాగా... జంకిన దొరలు నిజాం సైన్యాన్ని దింపారు. కొమురయ్య మృతదేహన్ని పోస్టుమార్టంకోసం జనగామకు తరలించిన పోలీసులు ఆయన శవం తిరిగి ఊరికి చేరితే... జనాగ్రహానికి కొంపలు కూలుతాయని అంచనాకొచ్చి అక్కడే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.
1946 జులై 4న జరిగిన ఈ ఘటనలో దొడ్డి కొమురయ్య మరణం.. వీరతెలంగాణ పోరులో తొలి బలిదానంగా చరిత్రలో నిలిచింది. కడివెండి నడిబొడ్డున ఎతైన నెత్తుటి జెండాగా కనిపించేె ఆయన స్ధూపం' నాటి ఘటనకు నెలువెత్తు సాక్ష్యం. ఆనాటి ఈ ఘటనే ఊరూరును అగ్ని కణంలా చేసింది. జన పోరాటాన్ని సాయుధ సమరంగా మార్చింది. అప్పటికే నిజాం, పటేళ్ల పీడనపై రగులుతున్న తెలంగాణ పల్లెలు... ''నీ పేరు నిలుపకనే కొమురయ్యా... నిదురైన పోబోము కొమరయ్య'' అంటూ ప్రతినబూని పోరుబాట పట్టాయి. ఈ ఘటన తర్వాత కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఊరూర గ్రామ రక్షక దళాలు సాయుధ బలగాలై తిరగబడ్డాయి. కడివెండి, కామారెడ్డి గూడెం, దేవరుప్పుల, ధర్మపురం గ్రామాలకు చెందిన 70 మంది యువకులు స్వచ్ఛంధంగా ''సాయుధ సైన్యంగా'' మారి జనానికి అండగా ధైర్యమై నిలిచారు. దొరసేనల దాడులనుంచి పేదల్ని రక్షించుకుంటూ వెట్టిచాకిరి, అణచివేత నిర్మూలనకు కృషి చేశారు.
కొమరయ్య అమరత్వంతో ప్రతిచోటా అణగారిన ప్రజలు మరింత చైతన్యమయ్యారు. సంఘం అండతో చుట్టు ముట్టు గ్రామాల్లో పేదలంతా దొరలు, జమీందార్లు, సర్కారు భూముల్ని సాగుచేసుకుని పుట్ల కొలది పంటల్ని లేవీ లేకుండానే ఇళ్లకు తెచ్చుకున్నారు. అడ్డమైన శిస్తులు, అడ్డగొలు అరాచకాల నుంచి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కాలంలోనూ... సంఘం శక్తి, కమ్యూనిస్టుల పోరాటాల ప్రభావం కడివెండిలో చెరగని ముద్రవేశాయి. అరుదైన పోరాటానికి పురిటి గడ్డగా నిలిచిన ఆ గ్రామం... వీర తెలంగాణ పోరు భూమిగా వినుతికెక్కింది.
అందుకే.... త్యాగాల తరులై... ఎర్రర్ర విరులై... కాలం మారుతున్నా... చరిత్రపుటల్లో కడివెండి ఓ వెగుచుక్కగా మెరుస్తూనే ఉంటది! కష్టజీవుల ఉద్యమ దరిన.. భవితకు దారి చూపే వెలుగు దిక్కుగా నిలుస్తూనే ఉంటది!!
- అనంగారి భాస్కర్ ,9010502255