Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలకు విరుద్ధంగా బోధన
- కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రయివేటు వర్సిటీల ఆగడాలు
- ఫీజులు చెల్లించాలంటూ వేధింపులు
- చోద్యం చూస్తున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెలవుల్లోనూ పలు విద్యాసంస్థలు తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈనెల 16వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకూ ప్రభుత్వం సెలువులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష బోధన చేపట్టకూడదనీ, తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అయినా కార్పొరేట్, ప్రయివేటు జూనియర్ కాలేజీలతోపాటు పలు ప్రయివేటు విశ్వవిద్యాలయాలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. వాటి ఆగడాలు పెరిగిపోతున్నాయి. యధేచ్చగా బోధనను కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే విద్యార్థులకు ఆయా సంస్థలు తరగతులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలు, పలు ఇంటర్నేషనల్ స్కూళ్లు, మహీంద్ర, అనురాగ్, మల్లారెడ్డి ప్రయివేటు విశ్వవిద్యాలయాలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఆయా విద్యాసంస్థలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను అమలు చేయడం లేదు. భౌతిక దూరం పాటించకుండా తరగతుల్లో బోధన కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా తరగతులను నిర్వహిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. విద్యార్థుల జీవితాలతో కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇంకోవైపు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నాయి. ప్రసుత విద్యాసంవత్సరం సజావుగా సాగుతుందో? లేదో?అన్న అనుమానంతో ఇప్పటి నుంచే వాటి వసూలుపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో ఈనెల 20 వరకు ప్రభుత్వం కరోనా ఆంక్షలను పొడిగించింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అనుమతి ఇస్తుందో?లేదో అని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. అందుకే ఫీజు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నా, కోవిడ్ నిబంధనలను పాటించకున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. ఆ విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలి : ఎస్ఎఫ్ఐ
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, ప్రయివేటు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లో, చుట్టుపక్కల కార్పొరేట్ కాలేజీలైన నారాయణ, శ్రీచైతన్య, మహీంద్ర, అనురాగ్, మల్లారెడ్డి విశ్వఇద్యాలయాలు విద్యార్థులకు సెలవులు మంజూరు చేయకుండా తరగతులను నిర్వహిస్తున్నాయని విమర్శించారు. ఫీజులు మొత్తం ఒకేసారి చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. ఆ విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.