Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎన్ఈజీఏ కింద యువతకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలి
- ఏఐవైఎఫ్ జాతీయ సమితి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో నిరుద్యోగ సమస్య పెద్ద సవాల్‌గా మారిందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ సమితి తెలిసింది. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని పిలుపునిచ్చింది. భగత్‌సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ చట్టం (బీఎన్ఈజీఏ)ను పార్లమెంట్లో ఆమోదించాలనీ, యువతకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. లౌకిక పార్టీలకు అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తామని చెప్పారు. బీఎన్ఈజీఏ పార్లమెంట్లో ప్రవేశపెట్టి, తక్షణమే అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు. జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యను బోధించాలని కోరారు. సమగ్ర విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దామాషా పద్ధతిన ఎన్నికలు అమలు చేయాలని వివరించారు. పేద, సామాన్యులకు అనుకూలమైన సమగ్ర వైద్య విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు.యువతకు ఉద్యోగావకాశాలను కల్పిం చాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశాల్లేనందున ప్రయివేటు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుఖ్జీందర్ మహేసరి మాట్లాడుతూ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రధాని మోడీ మాట తప్పారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు ఆఫ్తాబ్ ఆలంఖాన్,ఉపాధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ,కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్,ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేసరి,ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు నిర్లేకంటి శ్రీకాంత్ పాల్గొన్నారు.