Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్లు అందరికీ వేయించాలి..ప్రక్రియలో వేగం పెంచాలి
- మార్చిలోగా గ్రామాల్లోని పెండింగ్ పనుల్ని పూర్తిచేయాలి
- గ్రామకార్యదర్శులు ఉదయం ఏడింటికల్లా డ్యూటీకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో అప్రమత్తత అవసరమనీ, వ్యాక్సిన్ల ప్రక్రియలో వేగం పెంచి అందరికీ వేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ ఈ మార్చి లోగా పూర్తి కావాలనీ, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. పనులపై పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేయాలని ఉద్బోధించారు. మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీఓ, డీపీఓ, ఎంపీడీఓలు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్యంపై రాజీ లేకుండా, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. గతీ కరోనా సీజన్లలో పంచాయతీ సిబ్బంది, అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ట్రాక్టర్, ట్రాలీలతో చెత్త సేకరణ నిత్యం జరగాలనీ, డంపింగ్ యార్డులలో తడి, పొడి చెత్తలను వేరు చేసి, ఎరువుల తయారీ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి రోజూ గ్రామ కార్యదర్శులు ఉదయం ఏడు గంటల కల్లా విధుల్లో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వంద శాతం శ్మశానవాటికలు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ప్రకృతి వనాల స్థలాలు ఎక్కడైనా గుర్తించకపోతే వెంటనే ఆ పని పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, లేబర్ మొబిలైజేషన్, కొత్త కార్డుల జారీ అంశాలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో పట్టణ ప్రజలు పల్లెబాట పడుతున్నారనీ, అలాంటి వాళ్ళందరికీ ఉపాధి లభించేలా చూడటం మన బాధ్యత అని మంత్రి అన్నారు.