Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీసంస్థలకు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) జాతీయ అవార్డులు లభించాయి. ఆరు కేటగిరిల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఆరు అవార్డుల్ని ప్రకటించారు. మంగళవారం ఆన్లైన్ ద్వారా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి వీటిని అందుకున్నారు. ఆ సంస్థ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. ఢిల్లీకి చెందిన బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్‌కు రెండో ర్యాంకు, ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏపీఎస్పీడీసీఎల్కు మూడో ర్యాంక్ లభించాయి. ఈ సందర్భంగా ఐసీసీ ఆధ్వర్యంలో 15వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో భాగంగా 'విద్యుత్ పంపిణీ - సంస్కరణలు- సమర్ధత' అంశంపై వివిధ రాష్ట్రాల డిస్కం యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో ఆన్లైన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సామర్ధ్య నిర్వహణ, వినియోగదారుల సేవ, నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలు, పనితీరు సామర్ధ్యం, గ్రీన్ ఎనర్జీ విభాగంలో టీఎస్ఎస్పీడీసీఎల్కు నిర్వాహకులు అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా రఘుమారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ సంస్కరణలు, సేవల్ని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పడిన ఇబ్బందులు, వాటిని అధిగమించిన విధానాలను తెలిపారు. కార్యక్రమంలో టీపీడీడీఎల్ సీఈఓ గణేష్ శ్రీనివాసన్, బీఎస్ఈఎస్ డైరెక్టర్ అమల్ సిన్హా, బెంగాల్ విద్యుత్‌శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారులు విజరు సింఘాల్, జవీణ, నిహారి భికుంజ ధల్, అనిల్ రజ్దాన్ తదితరులు పాల్గొన్నారు.