Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిలో బదిలీ కార్మికుల పోస్టుల భర్తీపై హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి గనుల్లో భూగర్భంగా పనిచేసే కార్మికుల (బదిలీ) పోస్టుల భర్తీ వివాదానికి హైకోర్టు తెరదించింది. 2,800 పోస్టుల భర్తీకి 2017లో వెలువడిన నోటిఫికేషన్ మేరకు నియామకాలు చేయాలని ఆదేశించింది. పోస్టుల భర్తీ జీవో 34 నిబంధనల ప్రకారం ఉండాలని ఆదేశిస్తూ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2017లో వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న బదిలీ పోస్టుల భర్తీ జీవో 34 ప్రకారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్, అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సింగరేణి గనుల కోసం భూసేకరణ చేస్తే నిర్వాసిత బాధిత ఎస్టీలను బదిలీ పోస్టుల్లో నియమించేందుకు వీలుగా 2010లో జీవో 34 వెలువడిందన్నారు. 2017లో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ జీవో 34 ప్రకారం లేదన్నారు. ఈ వాదనను సింగరేణి బోర్డు వ్యతిరేకించింది. జీవో 34 ప్రకారమే అర్హతలున్న 260 మంది ఎస్టీల భర్తీ జరిగిందనీ, మిగిలిన వాళ్లకు అర్హతలు లేవని చెప్పింది.