Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివారం కూడా వ్యాక్సినేషన్, టెస్టులు
- బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు,సబ్ సెంటర్లు ఓపెన్: మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి సమయంలో గర్బిణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు వీలుగా ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక నుంచి ఆదివారం కూడా వ్యాక్సినేషన్, టెస్టులు ఉంటాయనీ, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు తెరిచి ఉంటాయని చెప్పారు. కరోనా సోకిన వారికి అత్యవసర చికిత్స అవసరమైతే, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డు కేటాయించాలని ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని కోరారు. దీనికి అనుగుణంగా ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ఆపరేషన్ థియెటర్, వార్డులు ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర మార్గదర్శ కాల మేరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి 10 గంటల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. సాధారణ లక్షణా లున్న వారికి కిట్లు పంపిణీ చేసి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రాన్ని అగ్రామిగా ఉంచేందుకు ఇతర శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. 15 నుంచి 17 ఏండ్ల వారికి ఇంటి వద్దనే వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, ఒక కోటి హౌం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.