Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపు
- తుర్కయాంజల్‌లో సీపీఐ(ఎం) శ్రేణులతో సమావేశం
నవతెలంగాణ-తుర్కయాంజల్
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఈనెల 22 నుంచి నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్‌లో సీపీఐ(ఎం) శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేండ్లకోసారి జరగాల్సిన రాష్ట్ర మహాసభ ఈనెల 22 నుంచి 25 వరకు తుర్కయాంజల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బి.వి రాఘవులుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీపీఐ(ఎం) అగ్రనేతలందరూ హాజరవుతారని చెప్పారు. కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఈ మహాసభలో చర్చించి ప్రజా ఉద్యమాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. పార్టీ నిర్మాణం, ప్రజా పునాదిని విస్తరించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో చర్చించనున్నామని తెలియ జేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, బి.మధుసూదన్ రెడ్డి, బి.సామెల్, సి.శోభన్, జి.కవిత, జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్, ఇ.నర్సింహా, ఏ.నర్సింహా, కె.జగన్, పి.అంజయ్య, నర్సిరెడ్డి, ఆర్.జంగయ్య, ఏ.భాస్కరెడ్డి, బి.శంకరయ్య, సీహెచ్.ఎల్లేశ్, రజాక్ పాషా, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.