Authorization
Fri April 11, 2025 12:19:36 pm
- దాన్ని ప్రభుత్వాలే కల్పించాలి
- 'నవతెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమబెంగాల్ కార్యదర్శి అమియాపాత్ర
బెంగాల్లో వ్యవసాయకార్మికుల పరిస్థితి ఎలా ఉంది?
ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి, శారీరక శ్రమ, కూలీల అవసరం తగ్గాయి. ఉపాధి అవకాశాలు లేక, గ్రామీణులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు.
రాష్ట్రం నుంచి వలసలు ఎందుకు పెరుగుతున్నాయి?
అసంఘటితరంగంలో ఉద్యోగాలు లేవు. వ్యవసాయ రంగంలో సాంకేతికత పెరిగింది. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కొత్త పరిశ్రమలు లేవు. ప్రభుత్వ ఖాళీల భర్తీ జరగట్లేదు. చదువుకుంటే ఉద్యోగం గ్యారెంటీ అనే భరోసా లేదు. ఫలితంగా వ్యవసాయ కార్మిక కుటుంబాల్లో పిల్లలు చదువుకున్నా, ఉపాధి లేక వలసల బాట పడుతున్నారు.
భూ పంపిణీ జరుగుతున్నదా?
సీపీఐ(ఎం) అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భూ పంపిణీ తప్ప, ఇప్పటి వరకు ఒక్క ఎకరా కూడా పేదలకు దక్కలేదు. కనీసం సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన భూమిని కూడా రాష్ట్రప్రభుత్వం పేదలకు ఇవ్వట్లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఆ ఇండ్లు చాలకపోవడమే దానికి కారణం. రాష్ట్రంలో గతంలో కంటే పని పరిస్థితులు మారాయి. మహిళలు వ్యవసాయకార్మికులుగా మారితే, పురుషులు అసంఘ టితరంగంలో పనిచేస్తూ, వలసలు వెళ్తున్నారు.
ప్రభుత్వం ప్రజలకు భారీగా రుణాలు ఇస్తున్నట్టు ప్రచారంచేస్తున్నది కదా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దరైతులకే రుణాలు ఇస్తున్నాయి. అలాగే వ్యవసాయాధారిత పరిశ్రమలకు 90 శాతం రుణాలు ఇస్తున్నారు. కేవలం రికార్డుల కోసం పదిశాతం మాత్రమే చిన్న రైతులకు రుణాలు ఇస్తున్నారు. మరోవైపు మహిళా స్వయం సహాయక గ్రూపులకూ రుణాలు ఇవ్వట్లేదు. ఫలితంగా ప్రజలు మైక్రో ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. వారు 30 నుంచి 32 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు.
కోవిడ్ టైంలో వ్యవసాయ కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంటి?
చాలా దారుణంగా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఆన్లైన్ చదువులు అర్థం కాలేదు. అనేకమందికి స్మార్ట్ఫోన్లుకొనే స్తోమత కూడా లేదు. డ్రాప్ అవుట్స్ భారీగా పెరిగాయి. కుటుంబాల ఆర్థిక ఇబ్బందులతో స్కూళ్లు మానేసిన పిల్లలంతా బాలకార్మికులుగా మారారు.
ప్రభుత్వాలు పట్టించుకోలేదా?
ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రధానమంత్రి గరీబ్ యోజన నిలిపివేశారు. దాని ద్వారా పేదలకు ఉచితంగా ఇచ్చే నిత్యవసరవస్తువుల సరఫరా నిలిచిపోయింది.
కూలి రేట్లు ఎలా ఉన్నాయి?
రాష్ట్రంలో కూలిరేట్లు దారుణంగా పడిపోయాయి. కేరళలో కూలీల దినసరి వేతనం రూ.700 ఉంది. బెంగాల్లో రోజుకూలీ కేవలం రూ.200 మాత్రమే. వలసలు పెరగడానికి ఇదీ ఓ కారణమే.
వ్యవసాయ కార్మిక సంఘంగా మీరేం చేస్తున్నారు?
ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహి స్తున్నాం. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ఉపాధి అంశాలపై పోరాటం చేస్తున్నాం. వ్య.కా.సం. 17 లక్షల సభ్యత్వం ఉంది. రాష్ట్రంలోని 20 గ్రామీణ జిల్లాల్లో సంఘం విస్తరించి ఉంది.