Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు ద్రోహం చేస్తున్న మోడీ సర్కారు
- ప్రమాదంలో రక్షణ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు
- ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ అడ్డుకునేందుకు ఐక్యపోరు
- సమ్మె సన్నాహాక సమావేశంలో కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కారు ప్రజాసంపదను కార్పొరేట్లను దోచిపెడుతున్న విధానాలను తిప్పికొట్టి దేశాన్ని రక్షించుకునేందుకు ఫిబ్రవరి 23,24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నామని తెలంగాణ కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక తెలిపింది. ఆ సమ్మెను జయప్రదం చేయాలని కార్మికలోకానికి పిలుపునిచ్చింది. సమ్మె ఆవశ్యకతను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కోరింది. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లో సన్నాహక సదస్సును నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక((ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, ఎఐయుటీయూసీ, సీసీజీఈడబ్ల్యూ, ఎఐబీఈఎఫ్, ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్) ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక సమ్మె విజయం కోరుతూ సన్నాహక సమావేశం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు అధ్యక్షతన జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రయివేటు భారీ పరిశ్రమలు, ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ సంస్థల్లో సమ్మె జయప్రదం చేసేలా కేంద్రీకరించాలని సూచించారు. అసంఘటిత, సంఘటిత కార్మికులు, ఉద్యోగులను చైతన్యపర్చి సమ్మెలో పాల్గొనేలా చేయాలని కోరారు. జిల్లా స్థాయి, సెక్టార్ స్థాయిలో యూనియన్ల మధ్య ఐక్యతను సాధించి సార్వత్రిక సమ్మె నిర్వహించి రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే విధంగా కార్యాచరణ ఉండాలని నిర్ణయించామన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.సాయిబాబా మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరుగబోయేది కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న సమ్మె అన్నారు. దేశభక్తి ముసుగులో దేశసంపదను కార్పొరేట్లకు మోడీ సర్కారు కట్టబెడుతున్నదని విమర్శించారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులంతా ఐక్యంగా, సమరశీలంగా సమ్మె నిర్వహించి మోడీ చర్యలను ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్ యాదవ్ మాట్లాడుతూ...మోడీ సర్కారు వచ్చాక నిరుద్యోగ రేటు పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారని విమర్శించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ.. ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవాలనీ, కార్మికుల్లో చైతన్యం నింపి సమ్మెకు సన్నద్ధం చేయాలన్నారు. సమ్మె సందర్భంగా భారీ బహిరంగ సభ పెడితే బాగుంటుందని సూచించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎంకే బోసు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల కార్మికవర్గం తీవ్ర ఇక్కట్లు గురవుతున్నదని పేర్కొన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వరంగ, బీమా, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టు రంగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసి ఐక్యంగా సమ్మె నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు. టిఆర్ఎస్కెవి ప్రధాన కార్యదర్శి నారాయణ, నాయకులు దానకర్మచారి మాట్లాడుతూ కార్మికుల రక్షణ కోసం బలమైన పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యం.డి.యూసుఫ్ మాట్లాడుతూ ఒక కోటి 20 లక్షల మంది కార్మికులు కనీస వేతనాలునోచుకోవటం లేదని అన్నారు. గోపాల్రావు (రక్షణ), తిరుపతయ్య, మహేష్ (ఎల్ఐసి), సుబ్బారావు (జనరల్ ఇన్సూరెన్స్), రాజ్భట్ (మెడికల్ రిప్రెంజెంటీస్), సాంబశివరావు(బిఎస్ఎన్ఎల్), మారయ్య, శ్రీకాంత్ (ట్రాన్స్పోర్ట్), ఎం.ఎన్.రావు, మహేశ్, తదితరులు ప్రసంగించారు.