Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ- సూర్యాపేట
తీసుకున్న అప్పుకు ప్రతి నెలా అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పూల సెంటర్లో నివాసం ఉండే వెంకటేష్- మాధురి దంపతులు శ్రీనివాస శారీష్, స్టీల్, మెటల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాపారం కోసం దంపతులు వడ్డీ వ్యాపారి అక్కినపల్లి మహేష్ వద్ద 2020లో రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మరో వ్యాపారి గారే సతీష్ వద్ద రూ.లక్షా30 వేలు తీసుకున్నారు. కాగా, రూ.7 లక్షల అప్పుకు వడ్డీ వ్యాపారికి నెలకు రూ.35 వేలు వడ్డీ చెల్లిస్తున్నారు.
ఈ డబ్బులకు మధ్యవర్తిగా ఉన్న మరో వ్యక్తికి, మహేష్, వెంకటేష్‌కు చిన్నపాటి వివాదాలు వచ్చాయి. దాంతో అప్పు డబ్బులు మొత్తం ఇవ్వాలని మహేష్ ఒత్తిడి తెచ్చారు. ఆలస్యం కావడంతో రెండు నెలల కిందట వెంకటేష్ దంపతులకు కోర్టు నుంచి నోటీసులు పంపించారు. ఈనెల 4న మహేష్ కొంతమందితో వెంకటేష్ దుకాణానికి వెళ్లి గొడవ చేశారు. ఆ రోజు నుంచి వెంకటేష్ దంపతులు దుకాణాన్ని తెరవలేదు. దీంతో తన పరువు పోయిందని భావించిన వెంకటేష్ భార్య మాధురి మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆ తర్వాత అత్తకు ఫోన్ చేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడంతో.. ఆమె వెంటనే కొడుకు వెంకటేష్‌కు సమాచారం అందించింది. వెంటనే ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు.