Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లల్ని బావిలో పడేసి.. తండ్రి ఆత్మహత్య
- మహబూబాబాద్‌లో ఘోరం
నవతెలంగాణ-మహబూబాబాద్
కన్న తండ్రే తన పిల్లలను బావిలో పడేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్యతో జరిగిన గొడవతో పిల్లల్ని బావిలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతారం రైల్వే గేటు దగ్గర ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహబూబా బాద్ జిల్లాను కలచివేసిన ఈ ఘటన వివరాలిలా.. మహబూబాబాద్ రూరల్ మండలం గడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని నెలకొండితండాకు చెందిన భూక్యా రాము అదే తండాకు చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సీఐఎస్ఎఫ్ (పోలీసు విభాగం)లో ఉద్యోగం రావడంతో కుటుంబాన్ని ముం బాయికి మార్చాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు కలిగారు. రాము కొంత కాలంగా ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు. అలాగే భార్య శిరీష మీదున్న ఆభరణాలను సైతం అప్పులున్నాయంటూ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాగా, నాలుగు రోజుల కిందట దంపతులు పిల్లలను తీసుకుని గడ్డిగూడెం తండాలోని రాము ఇంటికి వచ్చారు. భర్త వల్ల ఎదురవుతున్న సమస్యను శిరీష తండ్రి వీరన్నకు చెప్పగా అతడ్ని మందలించాడు. దాంతో రాము మంగళవారం ఉదయం శిరీషను చితకబాదాడు. దాంతో శిరీష.. కొడుకు అమీ జాక్సన్ (8), కూతురు జానీ బెస్ట్ (6)ను తీసుకుని పుట్టింటికి వెళ్తుండగా పిల్లలను లాక్కుని తండా శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం పిల్లలిద్దరినీ బావిలో పడేశాడు. పరిసరాల్లోని పొలాల్లో పని చేస్తున్న రైతులు గమనించి.. బావి వద్దకు పరుగున వచ్చి చూసే సరికి అప్పటికే పిల్లలిద్దరూ మృతి చెందారు. జనం గుమ్మికూడటంతో భయంతో అక్కడినుంచి రాము పారిపోయాడు. అనంతరం అనంతారం రైల్వే గేటు దగ్గర అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.