Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట ధర కూడా ముందే నిర్ణయం
- పెరుగుతున్న ఆరుతడి పంటలు ొ మార్కెట్ సౌకర్యం కష్టమే..
యాసంగి సాగులో ఒక్క వరి గింజ కూడా కొనుగోలు చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాత ప్రత్యామ్నాయం వైపు చూశాడు. వరి తప్ప మరో పంట సాగవ్వని భూముల్లో ఏం చేయాలో పాలుపోని రైతులు ఏదైతే అదే అవుతుందన్న మొండిధైర్యంతో ముందుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు.. రైతులు ఒప్పందం చేసుకుని సాగు చేస్తున్నారు. అయితే, ధాన్యం ధర కూడా సాగు ఒప్పందం సమయంలోనే నిర్ణయిస్తున్నారు. మరోవైపు ఆరుతడి పంటలు వేయాలన్న సర్కార్.. అందుకు అవసరమైన విత్తనాలు మాత్రం ఇవ్వడం లేదు. వాటి కోసం కూడా రైతులు వ్యాపారులనే ఆశ్రయించారు. చివరకు మార్కెట్ సౌకర్యం విషయమూ తేల్చడం లేదు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లాలో పంటల సాగు తీరు ఇలా ఉన్నది. వరి 54000 వేల ఎకరాలు, మొక్కజొన్న 15ఎకరాలు, పెసళ్లు 250ఎకరాలు, వేరుశనగ 21వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. యాదాద్రి జిల్లాలో వరి 2402, శనగలు 164, వేరుశనగ 726, పెసళ్లు 333ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో వరి 30922, వేరుశనగ 3240, ఉలువలు41, పెసళ్లు 241, మొక్కజొన్న 29, జొన్న 39, శనగ 59, మినుములు 143 ఎకరాల్లో సాగవుతోంది.
ధాన్యం లేకపోతే..
ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే నడిచే రైసు మిల్లులకు ధాన్యం లేకపోతే పని ఉండదు. యాసంగిలో వరి వేయకపోతే మూతపడే అవకాశముంది. యాసంగి వడ్లను తాము కొనబోమని, అయితే.. ముందుగా రైసు మిల్లుల యజమానులతో మాట్లాడి వరి సాగు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది మిల్లర్లు యాదాద్రి జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంత మండలాల రైతులతో మాట్లాడారు. కొంతమంది రైతులు మిర్యాలగూడ మిల్లర్లతో ఇప్పటికే మాట్లాడి ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. వీరేగాకుండా సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన రైతులు కూడా మిర్యాలగూడ రైసు మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కుర్ మండల కేంద్రానికి చెందిన రైతు శ్రీను మిర్యాలగూడలోని ఓ మిల్లు నుంచి చింట్లు (కావేరి సీడ్) రకం వరి విత్తనాలు 10కేజీల బ్యాగును రూ.1050కు కొనుగోలు చేశాడు. అదే సమయంలో ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని మిల్లరు రైతుకు చెప్పినట్టు సమాచారం. వరి తప్ప మరోపంట సాగయ్యే అవకాశం లేని రైతులు అదే సాగు చేసి ఎంతో కొంతకు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాము కొనుగోలు చేసే రకం పంటనే సాగు చేయాలని మిల్లర్లు సూచిస్తుండగా.. ఆ మేరకే రైతులు సాగు చేస్తున్నారు.
పంట ధర కూడా ముందే నిర్ణయం..
రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి జరుగుతున్న ఒప్పందం సమయంలోనే ధరను కూడా నిర్ణయించుకుంటున్నారు. అదీ రూ.1400 నుంచి 2వేల లోపే ఉంటోంది. పంట నాణ్యతను బట్టి ధర చెల్లిస్తామని చెపుతున్నప్పటికీ కొనుగోలు చేసే సమయంలో రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసే అవకాశముంది. దాంతో సాగు ఒప్పందం సమయంలోనే ధాన్యం ధరను కూడా మాట్లాడుకుంటున్నారు.
పెరిగిన ఆరుతడి పంటల సాగు
రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడం సాధ్యం కాదనడంతో అవకాశమున్న రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ప్రభుత్వం కనీసం విత్తనాలు కూడా రాయితీపై ఇవ్వలేకపోయింది. దాంతో వ్యాపారుల నుంచే విత్తనాలు కొనుగోలు చేశారు. ముఖ్యంగా వేరుశనగ, జొన్నలు, శనగ, పెసళ్లు సాగు చేస్తున్నారు. పత్తి సహజంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికంగానే సాగవుతోంది.
మార్కెట్ సౌకర్యమే కష్టం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరుతడి పంటలు సాగు గతం కంటే పెరిగింది. కానీ ఆ పంటలను కొనుగోలు చేయడానికి అవసరమైన మార్కెట్ సౌకర్యంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. సూర్యాపేట మార్కెట్లో దాదాపు అన్ని పంటలను కొనుగోలు చేస్తుంటారు. నల్లగొండ మార్కెట్లో కందులు మాత్రమే గతంలో కొనుగోలు చేశారు. మిర్యాలగూడలో ఆరుతడి పంట ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. మారుమూల పల్లెల్లో పంటలు సాగు చేసే రైతులు ఎక్కడ విక్రయించుకోవాలో పాలుపోని పరిస్థితి.