Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రైతు సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమేనా?
- రైతు హంతకులుగా కేటీఆర్, కేసీఆర్
- ఏబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్ ఎక్కడీ : పీసీసీ అధ్యక్షులు రేవంతరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు చాలా వరకు చేపట్టాం. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చాం. వ్యవసాయ పనిముట్లపై రాయితీలిచ్చాం. రాష్ట్రంలో ఫౌల్ట్రీఫామ్ను అభివృద్ధి చేశాం. కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనలో పథకాలపై చర్చకు రావాలంటూ కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. ఏ తారీఖో చెబితే నేను వస్తా. నాతోపాటు షబ్బీర్‌అలీ, కిసాన్‌సెల్ నేతలు కూడా వస్తారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అమలు చేసిన రైతు పథకాలపైనా, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమేనా?' అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసరడం, తండ్రి చాటున దాక్కోవడమో, కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడమో కేటీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైతుల చావులకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఇదేనా ఏబుల్ లీడర్ షిప్, స్టేబుల్ గవర్నమెంట్ అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పాలనలో గానీ, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గానీ... అమలు చేస్తున్న రైతు పథకాలు ఏంటో చెప్పాలని కేటీఆర్ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ కంటే అద్భుతమైన పథకాల్ని ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. వరికి రూ.1960 కనీస మద్దతు ధర ఉంటే అదనంగా రూ.600 బోనస్ కలిపి రూ.2560లకు కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతు సంబురాలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి రాసిన అధికారిక లేఖ ప్రకారం మూడున్నరేండ్లలో 75,014 మంది రైతులు చనిపోయారని తెలిపారు. రైతు బీమా పథకం ద్వారా రూ.3555 కోట్లు రైతులకు ఇచ్చామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించిందన్నారు. మూడున్నరేండ్లలో 75 వేల మంది అన్నదాతలు చనిపోవడం ప్రపంచంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ లేదని విమర్శించారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల రైతులు దళారుల చేతిలో మోసపోవడం వల్ల వందలాది మంది రైతులు చనిపోయారని చెప్పారు. ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్, కేటీఆర్ పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రూ.70వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిందని గుర్తుచేశారు. రూ.450 క్వింటా ఉన్న వరిధాన్యాన్ని రూ.1060కి పెంచామని వివరించారు. మొక్కజొన్నలు, ఎర్రజొన్నలు, పసుపు, మిర్చి, పత్తి రైతులకు కూడా కనీస మద్దతు ధర కల్పించామని చెప్పారు. జలయజ్ఞంలో భాగంగానే ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు చేపట్టామని గుర్తుచేశారు. ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు రాయితీలు, ఎరువులు, విత్తనాల సరఫరా, వ్యవసాయ పనిముట్లు, గిట్టుబాటు ధర, పండ్ల తోటలు, పౌల్ట్రీ ఫామ్‌లకు సంబంధించి అమలు చేసిన స్కీమ్ లపై సవివరంగా చర్చకు సిద్ధమని తేల్చిచెప్పారు.
ఏరులై పారుతున్న మద్యం
కాంగ్రెస్ హయాంలో రైతు బజార్లు ఏర్పాటు చేస్తే... టీఆర్ఎస్ ప్రభుత్వం సందు సందున బెల్ట్ షాపులు పెడుతున్నదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏడున్నరేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందనీ, యువతను తాగుడుకు బానిసలుగా మార్చుతున్నదని విమర్శించారు. అదే సమయంలో రైతుబంధు ద్వారా పంపిణీ చేసింది రూ.50 వేల కోట్లేనని వివరించారు. తులసి వనంలా ఉన్న తెలంగాణను గంజాయి వనంలా మార్చింది టీఆర్ఎస్నే అని విమర్శించారు.