Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా పాలిత రాష్ట్రాల్లోనే అటవీ హక్కుల చట్టం అమలు : ఏఐకేఎస్ నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా భారతదేశం అనేక రంగాల్లో వెనకబడిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నాయకులు విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఆన్లైన్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రసంగించారు. ఉదారవాద ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక దేశంలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు కార్పొరేట్లకు వ్యవసాయరంగాన్ని కట్టబెట్టే క్రమంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా రైతుల ఆదాయం పడిపోయిందన్నారు. కార్పొరేట్లకు లాభాలు పెరిగాయనీ, ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం వల్ల పెరిగిన కారణంగా ధరలు పెరిగి సామాన్యునికి భారంగా మారిందని తెలిపారు. పేదల్లో ఆకలి పెరిగిందనీ, ప్రజా ఆహార పంపిణీలో మన దేశం నేపాల్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడిందని విమర్శించారు. కనీస మద్ధతు ధర చట్టం, అజరు మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించడం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించడం తదితర డిమాండ్ల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునే పోరాటంలో రైతులు కలిసి రావాలని, పంటలకు ఉపయోగించే క్రిమినాశక మందుల నుంచి అనేకం ఉత్పత్తికి ప్రయివేటును ప్రోత్సహిస్తుండటంతో వాటి ధరలు పెరిగి పంటకయ్యే పెట్టుబడి ఎక్కువుతుందని చెప్పారు.
ఎర్రజెండా రాష్ట్రాల్లోనే ఎఫ్ఆర్ఏ అమలు
అటవీ హక్కుల చట్టాన్ని వామపక్షాలు పాలించిన పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న కేరళలో మాత్రమే అమలు చేశాయని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. నల్ల వ్యవసాయ చట్టాల రద్దును ప్రధాని మోడీ ఇష్టపూర్వకంగా చేసినట్టుగా లేడనీ, మరో రూపంలో ముందుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.