Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ ఈదురుగాలు
- కుప్పకూలిన 70అడుగుల హోర్డింగ్
- కరీంనగర్లో అత్యధిక వర్షపాతం
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీవర్షం
- వడగండ్లకు చిక్కి వ్యక్తి మృతి
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ దహెగాం, జన్నారం, పెంచికల్‌పేట
కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో మంగళవారం సాయంత్రం భారీ ఈదురుగాలుల తో కూడిన వడగండ్ల వానదంచికొట్టింది. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సుమారు అర గంటకుపైగా వర్షం బీభత్సం సృష్టించింది. ఫిబ్రవరిలో నిర్వహించబోయే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గీతా భవన్ చౌరస్తాలో కర్రలతో ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆసమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మంత్రి గం గుల కమలాకర్ వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులతో ఘటనాస్థలానికి చేరుకుని హోర్డింగ్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఉమ్మడి కరీం నగర్జిల్లాలో మానకొండూర్, రామడుగు, పెగడ పల్లి, శంకరటరపట్నం, పెగడపల్లి, సుల్తానాబాద్, కోనరావుపేట, గంగాధర, వేములవాడ, ఇల్లంత కుంట మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. సోమ వారం సాయంత్రమే వడగండ్లు కురవగా.. మంగళ వారం అధికారులు తీసిన వర్షపాతం లెక్కలు చూస్తే కరీంనగర్జిల్లా మానకొండూర్ మండలం తాడి కల్లో 6సెంటీమీటర్ల వర్షంకురిసింది. మంగళ వారం రాత్రివరకూ కురిసిన వర్షంతోలెక్కిస్తే సుమారు 10సెంటీమీటర్ల వర్షం కురిసి ఉంటుందని అధికారుల అంచనా. భారీ ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్‌తీగలు తెగి చాలా గ్రామాలకు కరెంటు సరఫరా అంతరాయం ఏర్పడింది.
ఆదిలాబాద్‌లో పంటలకు నష్టం
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కంది, పత్తి పంటలు తడిసి ముద్దయ్యాయి. కొద్దిపాటి పంట చేతికందుతుందనే దశలో రాళ్లతో కూడిన భారీ వర్షం పంటలను నేలపాలు చేసింది. దహెగాం మండలంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. గొర్రెగుట్ట, ఇట్యాల, బోర్లకుంట, బీబ్రా తదితర గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని వాన ముంచెత్తింది. ఉదయం మొదలైన వర్షం సాయంత్రం వరకు కూడా తగ్గుముఖం పట్టలేదు. మధ్యలో కొంత సేపు విరామం ఇచ్చినప్పటికీ సాయంత్రం తిరిగి మళ్లీ అందుకుంది. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పత్తి పంట నీటి పాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండి వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు తాత్కాలికంగా నిర్మించుకున్న వంతెన కొట్టుకుపోయింది. పెంచికల్పేట్, కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై బొంబాయిగూడ గ్రామ సమీపంలో రోడ్డుపై చెట్లు విరిగి పడ్డాయి.
వడగండ్ల పడి వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందంపల్లి గ్రామంలో వడగండ్లు పడి పెంద్రం రాజు(55) మృతిచెందాడు. సోమవారం సాయంత్రం పొలం నుంచి వస్తుండగా వడగండ్ల వర్షానికి చిక్కాడు. వడగండ్లు పడటంతో తలపై బొబ్బలు వచ్చాయి. తడుస్తూనే ఇంటికొచ్చిన రాజు రాత్రంతా చలితో వణకుతూ ప్రాణం కోల్పోయాడు.
వచ్చే మూడ్రోజులూ వడగండ్లవానలు!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులూ పలుప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో(ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్) వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గురువారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడొచ్చు. ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.