Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాలి...
- దేశానికి ఇది తక్షణావసరం : సీఎం కేసీఆర్‌తో భేటీలో బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి ప్రసాద్ యాదవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో బీజేపీ విచ్చిన్నకర అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలని ఆర్జేడీ నాయకుడు, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి ప్రసాద్ యాదవ్... సీఎం కేసీఆర్‌తో అన్నారు. ఇందుకోసం ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సి న అవసరముందని చెప్పారు. ఇది దేశానికి తక్షణావసరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో తేజస్వి యాదవ్.. సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, రైతులు సహా సమస్త వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని తేజస్వి యాదవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందువల్ల బీజేపీని గద్దె దించేంతవరకూ పోరాడా ల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఇందుకోసం భవిష్యత్ కార్యాచరణనురూపొందించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ఇటీవలే ఉభయ కమ్యునిస్టుపార్టీల అగ్రనేతలతో భేటీ అయిన సంగతి విదితమే. వారితో బీజేపీ ముక్త్ భారత్ గురించి ఆయన చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల ఐక్య సంఘటన దిశగా దేశంలో రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేసే అంశంపై ఆయన తేజస్వి యాదవ్‌తో చర్చించినట్టు తెలిసింది. భేటీ సందర్భంగా ఇక్కడి నుంచే బీహార్ మాజీ ముఖ్యమంత్రి, తేజస్వి తండ్రి లాలూప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ఫోన్లోమాట్లాడారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆర్జేడీ మద్దతిచ్చిన విషయాన్ని లాలూ గుర్తు ఈ సందర్భంగా గుర్తు చేశారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించాలంటూ ఆయన కేసీఆర్‌ను కోరినట్టు ఆయా వర్గాలు వివరించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని రానీయొద్దు.. దాని ఆరాచక పాలననుంచి దేశాన్ని రక్షించాలంటూ లాలూ కోరినట్టు తెలిసింది. ఉత్తర ప్రదేశ్ రాజకీ యాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై ఈ సందర్భంగా కేసీఆర్, తేజస్వి చర్చించారు. అక్కడ బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వచ్చిన విషయం వారిరువురి మధ్య ప్రస్తావనకొచ్చింది. ఇది బీజేపీ పతనానికి నాందిగా వారు అభివర్ణించారు. యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కే తమ మద్దతంటూ ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రకటించడం గొప్ప పరిణామమంటూ వారు అభిప్రాయపడ్డట్టు తెలిసింది.