Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి.. భుక్తి... విముక్తి....
వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రధాన లక్ష్యాలు. అందుకోసం...
ఊరూవాడ ఎగబడి, దొరలతో కలబడి .. సృష్టించిన ఒరవడి అంతా 1946 తర్వాతే. కానీ అంతకు ఆరేళ్లముందే ... దొర గూండాల దాడిలో నూరేళ్లు నిండాయి ఓ పేద ముస్లిం రైతుకు. ఎందుకు?
బందగీ బతుకులో...
'భూమి' కోసం పోరాటం
'భుక్తి' కోసం ఆరాటం
'విముక్తి' కోసం ఉబలాటం... ప్రధానమైనది.
ఈనాటి జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని కామారెడ్డి గూడెంకు చెందిన బందగీ జీవితాన్ని నిజాం ఏలుబడిలో జరిగిన అరాచకాలు, దోపిడీ దౌర్జన్యాలు అతలాకుతలం చేశాయి. ఊపిరికూడగట్టుకుని అన్యాయాన్ని ఎదిరించిన ఆ అన్నదాత న్యాయపోరాటంలో గెలిచి నిలిచినా... భరించలేని దొరతనానికి బలికాక తప్పలేదు. పెత్తనం కత్తులకు నెత్తురు మడుగులో ఒరగకా తప్పలేదు.
దేవరుప్పల దగ్గర జనగామ-తిరుమలగిరి రోడ్డు పక్కనే ఉన్న ఊరు కామారెడ్డి గూడెం. వ్యవసాయమే ప్రధానమైన ఈ పల్లె సైతం విస్నూరు దేశ్‌ముఖ్ ఇలాకాలోనె ఉండేది. ఇక్కడే బందగీ కుటుంబం జీవించేది. ఆయనకు ఐదుగురు సోదరులు. అందరూ పట్టాభూమి సాగుచేసుకుంటూ జీవిస్తుండగా విస్నూరు దొరవద్ద పనిచేసే బందగీ చిన్నాన్న, దొర ప్రయివేటు సైన్యంలో నమ్మిన బంటుగా ఉన్న పెద్దనాన్న కొడుకు అబ్బాస్‌అలీ కన్ను బందగీ భూమిపై పడ్డది. ఆస్తి పంపకాల్లో న్యాయంగా తనకొచ్చే భూమి తనదేనన్నాడు బందగీ. దొర అండతో అబ్బాస్‌అలీ బెదిరించాడు. దౌర్జన్యం చేశాడు. అయినా బందగీ లొంగకపోవడంతో పంచాయతీ విస్నూరు రామచంద్రారెడ్డి వద్దకు చేరింది. ''దొర గడి నుంచి పిలుపు వచ్చిందంటే మూడినట్టే - ఎదురు తిరిగినోడి బతుకు వాడినట్టే''. కానీ, బెదరలేదు బందగీ. నేరుగా దొరముందుకు వెళ్లాడు. న్యాయాన్యాయాల విచారణ లేకుండానే.. ఆ భూమి అబ్బాస్ అలీదేననీ, వెంటనే అతనికి అప్పగించాలని ఆర్డర్ వేశాడు దేశ్‌ముఖ్. తీర్పు అన్యాయమంటూ వెనుతిరిగి వచ్చాడు బందగీ. మాట వినలేదనే ఆగ్రహంతో అదిరింపులు, బెదిరింపులతో పాటు కుటుంబంలో కలహాలు పెట్టిమరీ లొంగదీసుకునే ప్రయత్నం చేసిన దొర చివరకి భూమినంత అబ్బాస్‌అలీకి అప్పగించాడు. బందగీ న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. అష్టకష్టాలు పడి కేసు వేసి కోర్టుకెక్కాడు. అబ్బస్అలీ తరుపున లాయర్‌ను ఏర్పాటుచేసి ఆర్థికంగా అండగా నిలిచాడు దొర. కాలం గడుస్తున్నా.. జనగామ మున్సిఫ్ కోర్టు నుంచి నల్లగొండ వరకు కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూనే వున్నాడు. ముల్లబా టలో ఒంటరి ప్రయాణం.. ఆర్థిక భారం.. అయినా ఆత్మగౌరవం, భూమి ముఖ్యమనుకున్న బందగీ దశాబ్దంపైగా పోరాటం కొనసాగించాడు. ''నేను ఓడిపోతే పేదోడిగా, ముస్లిం ఫకీర్‌గా అడుక్కొని అయిన బతుకుతాను. కానీ నీవు ఓటమిపాలయితే.. ముఖం ఎక్కడ పెట్టుకుంటావని'' కోర్టులోనే దొరను సవాల్ చేశాడు. చివరకు కోర్టు తీర్పుతో విజయం సాధించాడు. న్యాయపోరులో షేక్‌బందగీ గెలుపు దొరను షాక్‌కు గురిచేసింది. ఆగ్రహం నషాలాన్ని అంటింది. 60 ఊర్లలో ఎదురే లేదనుకున్న చోట... నిజాం రాజు అండగా నిలిచిన చోట... ఓ పేద ముస్లిం తనకు ఎదురు నిలవడాన్ని దొరతనానికే సవాల్‌గా భావించాడు రాంచంద్రారెడ్డి. మద్దతుదారులతో మంత నాలు జరిపాడు. కొత్త వ్యూహాలకు పదును పెట్టాడు. చీకటి ఆలోచనల్లో.... ఎందుకో చిరునవ్వు చిందించాడు.
అది 1940 జులై 3 శుక్రవారం రోజు. కేసు గెలిచిన ఆనందంలో ఉన్న బందగీ... జనగామ-సూర్యపేట బస్సు ఎక్కి పని నిమిత్తం వెళ్లేందుకు ఇంటినుండి బయటకు వచ్చాడు. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. బస్‌స్టాప్ వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముందే పథకం ప్రకారం సిద్ధమైన దొరమనుషుల మెరుపుదాడి... గొడ్డల్లు, వేటకొడవల్లతో విరుచుకుపడ్డ దొరమూక... నిరాయుధుడై నిలిచిన బందగీ చావుకేక. పని పూర్తి చేసుకున్న గూండాలు జొన్న చేలో నుంచి పారిపోయారు. బస్‌స్టాప్ సమీపంలోనే పచ్చని పొలాల పక్కన పారిన నెత్తురులో పోరు గుర్తుగా మిగిలిపోయింది బందగీ పార్థీవ దేహం.
1940దశకం ప్రారంభం... నిజాం అన్యాయాల్ని, సాంస్కృతిక అణచివేతల్ని వ్యతిరేకిస్తూ ముందుకు సాగుతున్న ఆంధ్ర మహాసభలో ప్రగతిశీలుర ప్రభావం పెరిగిన కాలం. రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనర్సింహ్మారెడ్డి మొదలైన వారికి కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధాలు ఏర్పడుతున్న సమయం. గ్రంథాలయ ఉద్యమం, ఉస్మానియా విద్యార్థుల వందేమాతర ఉద్యమం ద్వారా రాజకీయంగా క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో జరిగిన బందగీ హత్య... వీర తెలంగాణ సాయుధ పోరుకు ముందుగానే స్ఫూర్తినిచ్చిన ఘటనగా పేర్కొంటారు చరిత్ర కారులు, ఉద్యమ నేతలు. 1946లో దొడ్డి కొమరయ్య అమరత్వానికి ఆరేండ్ల ముందే బందగీ కనుమూసినా.. తన పోరాటం కూడా భూమి కోసమే, నైజాం రజాకార్ దేశ్‌ముఖ్‌ల ఆగడాలనుంచి విముక్తి కోసమే. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిందని చిత్రించేందుకు ప్రయత్నించే మతవాదులకు బందగీ మరణమే సమాధానం.
నాటి పోరాటం అన్యాయం అణచివేత పీడనలపైనే కానీ కులమతాల సంకుచిత స్వభావం ఆ మహత్తర సమరానికి అంటదని చాటుతోంది ఇలాంటిదే మరోఘటన. మానవత్వానిదే విజయమనేలా.. ''జాగ్ ఉఠా జనగాం, తలాష్, కడివెండి'' కవితల్ని ''తాజ్'' పత్రికలో ప్రచురించినందుకు దక్కన్ రేడియో డైరెక్టర్ ఉద్యోగం నుంచి స్వయాన తన మేనల్లుడైన ''మైకేష్''ను తొలగించాడు నైజాం రాజు. ఇది కూడా తెలంగాణ ఉద్యమం మతానికి అతీతమని గుర్తు చేస్తుంది.
బందగీ బలిదానానికి కేంద్రమైన కామారెడ్డి గూడెం.. ముందుగానే ఉద్యమ గుర్తుగా నిలవడమే కాదు... తర్వాత కాలంలోను వీరతెలంగాణ సాయుధ పోరులో క్రియ శీలకంగా వ్యవహరించింది. ఇక.. ఒక పోరాట యోధున్ని కీర్తించడంలోనూ విభిన్నత చాటుకుంది. బందగీ త్యాగాన్ని స్మరించుకుంటూ ఏటా అక్కడ భారీ ఎత్తున ఉర్సు జరిగేది. క్రమేణా ఉర్సు తీరు మారినా... నేటికి ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది.
అందువల్లనే....
బందగీ త్యాగం పేదల ధిక్కార పతాకమే...
కామారెడ్డిగూడెం మన జన కదనరంగమే...
- అనంగారి భాస్కర్ ,9010502255