Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
ఆదాయానికి మించి ఆస్థులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఎం.జైపాల్ రెడ్డి ఆస్థులపై అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జైపాల్ రెడ్డికి చెందిన రూ. 3.40 కోట్ల ఆస్థులు బహిర్గతమయ్యాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అవినీతి, అక్రమాలకు పాల్పడి ఎంపీడీఓ జైపాల్ రెడ్డి కోట్లల్లో అక్రమాస్థులు కలిగి ఉన్నట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. ఈ మేరకు మెదక్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అతని ఆస్థులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అతని నివాసంలో విలువైన బంగారు నగలు, గృహ వినియోగ వస్తువులు, వాహనాలు, భూములకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. వాటన్నిటిని విలువను మదింపు చేసిన అధికారులు ఈ అక్రమాస్థుల విలువ రూ. 3.40 కోట్లుగా తేల్చారు. దీంతో ఎంపీడీఓ జైపాల్ రెడ్డిని బుధవారం అరెస్టు చేసి ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
ప్రభుత్వ శాఖలలో అవినీతి, లంచగొండి, అక్రమాస్థులు కలిగినవారి వివరాలను తమకు అందజేయాలని ఈ సందర్భంగా ఏసీబీ డీజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారమందించినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.