Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 లక్షల మందిని సభ్యులుగా చేరుస్తాం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం పొందిన వారికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, జి చిన్నారెడ్డి, షబ్బీర్ అలీతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయలు, ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం అందుతుందని చెప్పారు. ఇప్పటిదాకా 7 లక్షల సభ్యత్వం నమోదు చేయించామనీ, మొత్తం 30లక్షల సభ్యత్వం చేస్తామన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా ఒక రక్షణగా ఉంటుందని తెలిపారు. ప్రతిపోలింగ్ కేంద్రం పరిధిలో వంద సభ్యత్వం చేస్తామన్నారు. సభ్యులకు ఒక ఐడీికార్డు కూడా ఇస్తామనీ, కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా ఆధారంగా సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నట్టు తెలిపారు. మండలంలో 15వేలు, నియోజకవర్గంలో 5వేలు, పార్లమెంటు పరిధిలో మూడున్నర లక్షల సభ్యత్వాలు నమోదు చేసిన వారిని రాహుల్‌గాంధీ అభినందిస్తారని వివరించారు.
డిజిటల్ సభ్యత్వ నమోదుకు గ్రామాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సాధ్యమైనంత వరకు డిజిటల్ ద్వారా చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.