Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడుగులను ఉన్నత విద్య నుంచి దూరం చేస్తే ఊరుకోబోమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా బీసీలపై ప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఆ సంఘం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీక్షా నిర్వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ దోమల్ గూడలోని బీసీ భవన్లో జరిగిన విద్యాదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు 10 వేలలోపు ర్యాంకు షరతును ఎత్తివేయాలనీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతిలోపు ఫీజుల బకాయిలు విడుదల చేయకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలను అడ్డుకుంటామనీ, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల విద్యార్థికి ఒక్కరికీ ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ కేవలం రూ.45 వేలు మాత్రమే వెచ్చిస్తున్నదని విమర్శించారు. దీంతో కప్పుకోవడానికి దుప్పట్లు, పుస్తకాలు, తాగునీరు, బట్టలు, బూట్లు కూడా ఇవ్వడం లేదనీ, పక్కా భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు గురుకులాల్లో పర్యటించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ దీక్షలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విద్యార్థి, యువజన నాయకులు తాటికొండ విక్రంగౌడ్, జాజుల లింగం తదితరులు పాల్గొన్నారు.