Authorization
Sat April 12, 2025 07:02:35 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) ఖాళీలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మల్టీ జోన్-1 నుంచి 2కు కేటాయించిన 40 మంది, మల్టీ జోన్-2 నుంచి 1కు కేటాయించిన 58 మంది ప్రధానోపాధ్యాయులున్నారని తెలిపింది. పాఠశాలలు ప్రకటించకుండా నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలకు ఆప్షన్ ఇవ్వమనటాన్ని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పోస్టును మల్టీ జోన్ పోస్టుగా మార్చిన తర్వాత దాని పరిధిలో ఏ పాఠశాలనైనా ఎంచుకునే అవకాశం ప్రధానోపాధ్యాయులకు ఉంటుందని తెలిపారు. కానీ జిల్లాను ఎంచుకుంటే అక్కడ పోస్టింగ్ ఇస్తామని అధికారులు చెప్పడం నిబంధనలను ఉల్లంఘించడమేనని విమర్శించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు చూపించి అధికారులు కేటాయించారని గుర్తు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విషయంలో జిల్లాలను ఎంచుకోవాలనడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధానోపాధ్యాయుల సంఖ్యకు సరిపడా పాఠశాలల ఖాళీలను చూపించిన తర్వాతే ఆప్షన్లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.