Authorization
Sun April 13, 2025 11:16:51 am
- జీవో 317 అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే భేటీలు
- తేజస్వీయాదవ్‌తో సీఎం భేటీపై బండి వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'లాలూ ప్రసాద్ వేల కోట్లు దోచుకున్నడు. మన రాష్ట్ర సీఎం కేసీఆర్ ఏకంగా లక్షల కోట్లు దోచుకున్నడు. ఇక్కడ దోచుకోవడమెలా అనే అంశంపై శిక్షణా సమావేశాలు పెట్టినట్టుండు. వీళ్లంతా కలిసి ''దోచుకోండి-దాచుకోండి'' అనే పార్టీ పెడుతరేమో' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ జైలుకెళ్లే సమయం దగ్గరపడ్డదనీ, అందుకే ప్రతిపక్ష పార్టీల నేతలను కలుస్తున్నాడని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నేటి యువతకు వివేకానంద జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన బతికింది 39 ఏండ్లేగానీ మరో వెయ్యేండ్లకు కూడా చెరిగిపోని ముద్ర వేసిన యుగపురుషుడని కొనియాడారు. 317 జీఓను సవరించాలని బీజేపీ పోరాటం చేస్తున్న అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే కేసీఆర్ భేటీల పేరుతో డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. 'ములాయంసింగ్, లాలూ ప్రసాద్ కొడుకులొచ్చినా, తాలిబన్, అల్‌ఖైదా, ఐఎస్ఐ, రోహింగ్యాలను ఎవరిని తీసుకొచ్చినా నువ్వేం చేయలేవు కేసీఆర్..నీ అవినీతిపై కేంద్రం సీరియస్‌గా ఉంది. అందుకే ఫ్రంట్ టెంట్ పేరుతో డ్రామాలు చేస్తున్నావ్. నువ్వు ఎక్కడ వున్నా నిన్ను గుంజుకొచ్చి జైల్లో వేసేది ఖాయం' అంటూ వ్యాఖ్యానించారు. సానుభూతిని పొందడం కోసమే కమ్యూనిస్టు, విపక్ష పార్టీల నేతల తో భేటీ అవుతున్నాడని విమర్శించారు. తేజస్వీయాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాసం కుంభకోణం కేసులో జైల్ కు వెళ్లి వచ్చిండనీ, నిన్న ప్రగతి భవన్‌కు వచ్చి జైలు జీవితం ఎలా ఉంటుందో తేజస్వీ ఈ సీఎంకు వివరించి ఉంటాడని ఎద్దేవా చేశారు.