Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలివ్వాలి
- పురపాలక కమిషనర్‌కు మున్సిపల్ జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించేందుకుగానూ జీవో నెంబర్ 4ని సవరించాలని మున్సిపల్ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం ఈ మేరకు హైదరాబాద్‌లో పురపాలక శాఖ కమిషనర్ ఎన్.సత్యనారాయణకు వినతిపత్రాన్ని జేఏసీ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలడుగు భాస్కర్(సీఐటీయూ), మంద వెంకటేశ్వర్లు (ఏఐటీయూసీ), వి.ప్రవీణ్ (ఐఎఫ్టీయూ), శివబాబు (ఐఎఫ్టీయూ), ఎంకేబోసు (టీఎన్టీయూసీ), ఎస్.వెంకన్న (ఐఎన్టీయూసీ), బాబూరావు (ఏఐయూటీయూసీ), తదితరులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీలకు వేతన వ్యత్యాసం లేకుండా గుండుగుత్తగా కార్మికులందరికీ రూ.15,600 నిర్ణయించడం సరిగాదన్నారు. జీఓ నెం.60 ప్రకారం వివిధ కేటగిరీలకు రూ.15,600, రూ.19,500, రూ.22,50 ఇవ్వాల్సి ఉండగా..దానికి విరుద్ధంగా వేతనాల్లో కోతలు పెట్టి జీవో నెంబర్ 4 విడుదల చేయడం అన్యాయమని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వేతనాలను ఏరియల్స్తో సహా చెల్లించాలనీ, జీవో నెంబర్ 4ని సవరించాలని డిమాండ్ చేశారు.