Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి విజయం సాధించిన అంగన్ వాడీలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంగన్వాడీల సమస్యలు ఇన్నీ అన్నీ కావు. వాటి పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా రేషన్ బియ్యం రవాణా ఛార్జీలను చెల్లిస్తే తప్ప బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని జనవరి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు తీసుకుపోయేది లేదంటూ భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా అంగన్ వాడీ ఉద్యోగులు చేసిన పోరాటం విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం హైదరాబాద్లో ఐసీడీఎస్ కమిషనర్ దివ్య, అంగన్ వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, ఆ యూనియన్ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ప్రతినిధులతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రాజెక్టులను ఎంపిక చేసి సీపీడీఓల ద్వారా వాహనం ఏర్పాటు చేసి వారే సరఫరా చేసేలా చూస్తామని తెలిపారు. అంతే కాకుండా మధ్యాహ్న భోజనానికి ఇస్తున్న బియ్యం మాదిరిగా పౌరసరఫరాల ద్వారా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ రెండు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తామనీ, అది విఫలమైతే రవాణా ఛార్జీలు చెల్లించే విషయం ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రయోగాల్లో ఏది బాగుంటే దాన్ని వచ్చే మార్చి నుంచి అమలు చేస్తామని తెలిపారు. మూడేండ్ల నుంచి అంగన్ వాడీ టీచర్లు భరించిన కిరాయిలను లెక్కలు కట్టి వచ్చే ఏప్రిల్ నాటికి చెల్లిస్తామని కమిషనర్ తెలిపారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇ.వెంకటమ్మ, జి.పద్మ, జిల్లా ఆఫీస్ బేరర్లు విజయశీల, రాధాకుమారి పాల్గొన్నారు.
అభినందనలు.....
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ ఉద్యోగులందరికీ లబ్ది చేకూరే విధంగా పోరాడి విజయం సాధించిన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అంగన్ వాడీ ఉద్యోగులకు తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది.