Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగాజలం కోసం బయల్దేరిన మెస్రం వంశీయులు
- ఆలయ నిర్మాణానికి రూ.4కోట్లు జమ
- దేవాదాయ శాఖ రూ.50 లక్షలు మంజూరు : మంత్రులు
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
గిరిజనుల ఆరాధ్య దైవమైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. మంత్రులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ అంకిత్, జిల్లా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మంత్రులు నాగోబా దేవతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. మెస్రం వంశీయులు రూ.4కోట్లు జమచేసి దేవాలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమని, దేవాదాయ శాఖ ద్వారా రూ.50లక్షలు మంజూరు చేశామని తెలిపారు. నంద్యాల రాయితో దేవాలయ నిర్మాణం అద్భుతంగా జరుగుతోందన్నారు. యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణం మాదిరిగా నాగోబా దేవాలయాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. రెండేండ్ల నుంచి కోవిడ్ కారణంగా నాగోబా జాతర సందర్భంగా దర్బార్‌ను నిర్వహించలేకపోయామని తెలిపారు. దర్బార్‌లో గిరిజనుల సమస్యలు కలెక్టర్, ప్రాజెక్టు అధికారి నేతృత్వంలో పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో దేవాలయాల పనులకు ఇరవై శాతం కాంట్రిబ్యూషన్తో నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేసి నాగోబా దేవాలయ నిర్మాణ పనులను వచ్చే జాతర నాటికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏడేండ్ల కాలంలో సీఎం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.350కోట్లు మంజూరు చేశారని తెలిపారు. జోడేఘాట్‌లో రూ.26కోట్లతో వివిధ పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్, నిర్మల్ జడ్పీ చైర్మెన్లు రాథోడ్ జనార్ధన్, విజయలక్ష్మి, ఎమ్యెల్యేలు రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గెడం నగేష్, స్థానిక సర్పంచ్ మెస్రం రేణుక నాగనాథ్, మెస్రం వంశీయులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గంగాజలం కోసం పయనం
నాగోబా జాతర ప్రారంభానికి ముందు పవిత్ర గంగాజలం కోసం మెస్రం వంశీయులు బుధవారం సాయంత్రం కాలినడకన పయనమయ్యారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మెస్రం వంశీయులు పటేల్ వెంకట్రావ్ ఆధ్వర్యంలో మురాడి వద్దకు చేరుకున్నారు. అక్కడ సమావేశమయ్యారు. గ్రామాల్లో బస చేసే వివరాలపై చర్చించారు. మరాడి వద్ద సంప్రదాయ పూజలు చేశారు. గంగా జలం కోసం ఉపయోగించే ఝారి(రాగి కలశం)ని ఖటోడ(పూజారి) కోసు వీపుకు తెల్లటి వస్త్రంతో కట్టారు. అనంతరం మెస్రం వంశీయులు వారిని గంగాజలానికి సాగనంపారు. 18న పవిత్ర గోదావరి వద్ద గంగాజలానికి పూజ చేసి తిరుగు పయనమవుతారు. 27న ఇంద్రాదేవికి సంప్రదాయ పూజలు చేసి కేస్లాపూర్‌లోని మర్రిచెట్టు వద్దకు చేరుకుంటారు. 31న గంగాజలంతో పూజ చేసి జాతరను ప్రారంభిస్తారు.