Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త మార్గదర్శకాలతో బదిలీలు చేపట్టాలి
- 124 జీవో రాజ్యాంగబద్ధతను నిరూపించాలి
- స్థానికత కోల్పోయిన ఉద్యోగులు, టీచర్లకు న్యాయం చేయాలి
- ఆమాద్మీ పార్టీ రౌండ్‌టేబుల్‌లో వక్తల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317ను రద్దు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కొత్త మార్గదర్శకాలు రూపొందించి బదిలీల ప్రక్రియ చేపట్టాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన 124 జీవో రాజ్యాంగబద్ధతను నిరూపించాలని తెలిపారు. 317 జీవో కారణంగా స్థానికత కోల్పోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వితంతువులు, భార్యాభర్తలు, ఒంటరి మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. '317 జీవో'పై ఆమాద్మీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమాద్మీ పార్టీ రాష్ట్ర కో ఇంఛార్జీ ఇందిరాశోభన్ మాట్లాడుతూ 317 జీవో ఉద్యోగులు, ఉపాధ్యాయులను బలి తీసుకుంటున్నదని విమర్శించారు. జోనల్ వ్యవస్థ అంటేనే స్థానికతకు సంబంధించిందని గుర్తు చేశారు. కానీ ఆ జీవోలో స్థానికతకు అర్థం లేకుండా పోయిందన్నారు. అనాలోచితంగా, అశాస్త్రీయంగా ప్రభుత్వం తెచ్చిన ఆ జీవో ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు ఆమాద్మీ పార్టీ అండగా ఉంటుందన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుఉ వెళ్తామని అన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తం మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చించి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని విభజన ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను విభజించారనీ, పదోన్నతి, బదిలీ సమయంలోనూ ఇదే విధానాన్ని పాటిస్తారా?అని ప్రశ్నించారు. సీనియార్టీ జాబితా పెట్టిన తర్వాతే ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల కేటాయింపుల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పౌజ్, మెడికల్ సమస్యలు, వికలాంగులు, వితంతువుల సర్దుబాటుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు జీవో నెంబర్ 3 ఆధారంగానే జరాలపి సూచించారు. బదిలీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమాద్మీ పార్టీ నాయకులు అబ్దుల్, సాధిక్, దినేష్, రాజేష్‌తోపాటు పీడీఏఏ నాయకులు పరుష్రాజ్, టీఎస్ఎన్ఈయూ అధ్యక్షులు కె లక్ష్మణ్‌తోపాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.