Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొద్ది వారాల్లో అందరికీ పాజిటివ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తున్న తీరు ఉప్పెనను తలపిస్తున్నది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ లో పలువురికి సోకిన కరోనా, విద్యాలయాలను కూడా చుట్టేస్తున్నది. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఒకేసారి పదుల సంఖ్యలో డాక్టర్లు, వైద్యవిద్యార్థులు దీని బారిన పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటం, పట్టణాల నుంచి గ్రామాలకు వేలాదిగా ప్రజలు తరలివెళుతుండగా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రెండో వేవ్ లో వచ్చిన డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య స్వల్పంగా ఉండటమే ఊరటనిస్తున్నది. అందుకే ఒమిక్రాన్ ఉప్పెనలా విస్తరిస్తున్న మాట నిజమే..... అయితే అది ప్రాణాలు తీయని ఉప్పెన అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు ఈ వేరియంట్ గొంతుకు సమీపంలోనే ఇబ్బంది కలిగిస్తుండగా, ఊపిరితిత్తులపై ప్రభావం చూపటం లేదని ఒమిక్రాన్ రోగులకు వైద్యమందించిన డాక్టర్ ఒకరు చెప్పారు. కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో ఐసీఎంఆర్ మరోసారి మార్గదర్శకాలను సవరించింది. లక్షణాలు లేని పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులకు ఇక మీదట పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే ఇతర వ్యాధులతో బాధపడే, వయస్సు పైబడిన కాంటాక్టులతో పాటు లక్షణాలు కలిగిన వారికి టెస్టులు చేయాల్సి ఉంటుంది.
ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండటం, డెల్టా వేరియంట్‌తో పోలిస్తే తీవ్రత చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియెంట్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం మేరకు అది ప్రమాదకరం కాదని తెలుస్తున్నదని చెబుతున్నారు. ఒమిక్రాన్ తర్వాత ఇక మహమ్మారి కాస్తా కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే వ్యాధిగా మిగిలిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
వ్యాక్సినేషన్ పైనే ఫోకస్
కేసుల వ్యాప్తిని ఆపలేం. అది స్పష్టం. ఒమిక్రాన్ వ్యాప్తి వేగం అలాంటిది. నేడు కాకపోతే రేపు అందరికీ సోకుతుంది. అయితే కరోనాకు సంబంధించి ఏ వేరియంట్ వచ్చినా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటున్నది. వ్యాక్సిన్ ప్రాణాలను కాపాడుతున్నది. అందుకే ఆంక్షల కన్నా వ్యాక్సినేషన్లో వేగం పెంచడాన్నే ప్రధానంగా భావిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికీ గడువు తీరిన రెండో డోసు తీసుకోని వారు వెంటనే టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.