Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల మధ్య ఎవరివాదన వారిదే..
- కేంద్ర హోంశాఖ నిర్వహించిన వర్చువల్ సమావేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విభజన సమస్యలు తేలలేదు. వీటి పరిష్కారం కోసం కేంద్ర హౌంశాఖ కార్యదర్శి అజరుభల్లా బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎవరి వాదన వారు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జిఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తా నియా, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం సింగిల్ పాయింట్ ఫార్ములాను రూపొందించేందుకు ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు (తెలంగాణ), రావత్ (ఏపీ)ల నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుల్లో వేసిన రిట్ పిటీషన్లను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ అధికారులు కోరారు. అయితే విభజన చట్టానికి భిన్నంగా పరిష్కారాలను సూచిస్తే, తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ అధికారులు తేల్చిచెప్పడంతో సమస్యలు కొలిక్కి రాలేదు. విద్యుత్ బకాయిల చెల్లింపు అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. తమకు తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రూ.3,442 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. దీనిపై తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు తమ వాదన వినిపించారు. దీనిపై హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటే పరిష్కారం దిశగా అడుగులు వేద్దామని ప్రతిపాదించారు. ఈ అంశంపైనే 2014లో కేంద్రప్రభుత్వం నీరజామాథూర్ కమిటీతో విచారణ జరిపిందనీ, ఏడున్నరేండ్లు అయినా ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదని గుర్తుచేశారు. 9, 10 షెడ్యూళ్ళలోని సంస్థల విభజన అంశం కూడా కొలిక్కి రాలేదు. ఇక్కడా కోర్టు కేసులే అడ్డుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హౌల్డింగ్స్ లిమిటెడ్ (డీఐఎల్ఎల్)పై కూడా ఏపీ ప్రభుత్వం కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న అంశాన్ని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. సింగరేణి కాలరీస్, దాని అనుబంధ పరిశ్రమ ఏపీ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్ఎమ్ ఈఎల్) సమస్యపైనా ఇరు రాష్ట్రాల అధికారులు మాట్లాడారు. దీనిపై తెలంగాణ వాదనను కేంద్ర హౌం శాఖ కార్యదర్శి అజరుభల్లా సమర్థించారు.